వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత
posted on Feb 26, 2023 @ 11:32PM
గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆదివారం (ఫిబ్రవరి 26) కన్నుమూసింది. సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
సీనియర్ స్టూడెంట్ సైఫ్ గత కొన్నాళ్లుగా ప్రీతిని వేధిస్తున్నాడనీ, వాట్సాప్ గ్రూపుల్లో అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మేసేజ్‌లు పెట్టవద్దని వేడుకున్నా వినకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వరంగల్ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేసినట్లు గుర్తించామని పోలీసులు ధృవీకరించారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. కాగా ప్రీతి మృతితో ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రీతి మృతితో నిమ్స్ ఆస్పత్రి వద్ద వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆందోళనలు చేపపట్టారు. మంత్రీ కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని ఇక్కడ్నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రి వర్గాలు, అధికారులు చర్యలు చేపట్టారు. ప్రీతి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మరో వైపు ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. తమ కుమార్తెకు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతున్న రోజున అసలేం జరిగిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అరెస్టు చేసిన సైఫ్ తో పాటు, వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానిస్తూ పోస్టులు పెట్టిన వారందరిపై కూడా చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.