కోమటిరెడ్డి కుమారుడు మృతి,పలు నేతల సంతాపం
posted on Dec 21, 2011 8:16AM
మెదక్ : జిల్లాలోని పఠాన్‌చెరు మండలం కొల్లూరు వద్ద డివైడర్‌ను స్కోడా కారు ఢీకొట్టిన ప్రమాదంలో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి మృతిచెందారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మృతిచెందారు. వీరు ముగ్గురూ సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ప్రతీక్‌రెడ్డి సిబిఐటిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కోమటిరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు. మిగిలిన ఇద్దరిని సుచిత్‌రెడ్డి, చంద్రారెడ్డిలుగా గుర్తించారు. గాయపడిన ఆరోహన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొడుకు మరణవార్త విన్న వెంటనే వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు. కోమటిరెడ్డి సోదరులు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గొర్రెలను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందారు. ప్రతీక్‌రెడ్డి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పుటిప్పుడే కోమటిరెడ్డి ఇంటికి కార్యకర్తలు, బంధువులు చేరుకుంటున్నారు. ప్రమాదానికి గురైన కారు కోమటిరెడ్డి బంధువు పోరెడ్డి నర్సింహరెడ్డికి చెందినదిగా గుర్తించారు.
కాగా మెదక్ జిల్లా, కొల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రతీక్‌రెడ్డి మరణం పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కోమటిరెడ్డిని ఫోనులో పరామర్శించారు. మంత్రులు జానారెడ్డి, ఆనం, డీకే అరుణ, వట్టి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, భిక్షమయ్యగౌడ్, మోత్కుపల్లి ప్రతీక్‌రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. మంత్రి జానారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, టి.కాంగ్రెస్ ఎంపీల తరఫున పొన్నం ప్రభాకర్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, మంత్రి పార్థసారథి, మిర్యాలగూడ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లు తమ సందేశాల్లో సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, పొన్నాల, ఉమామాధవరెడ్డి గంటా శ్రీనివాస్,, వీహెచ్, బొత్స, పొంగులేటి,విజయశాంతి, దిలీప్‌కుమార్‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరులు అనిల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులను హోం మంత్రి సబితారెడ్డి, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు బాలు నాయక్, ప్రతాప్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజేందర్, పిడమర్తి లింగయ్య, శ్రీశైలం గౌడ్‌లుపరామర్శించారు. ప్రతీక్ మరణంతో చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విషాదం అలముకుంది.
కాగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా, బ్రాహ్మణవెల్లెంలలో జరుగుతాయి. కాసేపట్లో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.