ఇన్ఫ్లూయెంజా ఎఫెక్ట్.. కర్నాటకలో మాస్క్ మస్ట్
posted on Mar 9, 2023 @ 3:18PM
ఇటీవలి కాలంలో దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న ఇన్ ఫ్లుయెంజా వైరస్ (హెచ్3ఎన్2) ప్రభావంతో కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు రావాలంటే మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కర్నాటకలో ఇన్ ఫ్లూయెంజా విశ్వరూపం చూపుతోంది. శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు మాస్కును తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే గుంపులు గుంపులుగా చేరవద్దని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇన్ఫుయెంజాను కట్టడి చేసేందుకు ప్రజలు చొరవ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించింది. ఇన్ఫుయెంజా లక్షణాలు చాలా వరకూ కోవిడ్ లక్షణాలను పోలి ఉంటాయనీ, అందుకే లక్షణాలు కనిపించిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. ఇన్ఫ్లుయెంజాను అరికట్టాలంటే కఠిన ఆంక్షలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.