తెలంగాణ సీఎం రేసులో మర్రి శశిధర్..!

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏమోగాని...రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి కావాలనుకోనె వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ సీఎం రేసులో మర్రి శశిధర్ రెడ్డి కూడా చేరిపోయారు. గత కొన్ని రోజుల నుంచి శశిధర్ రెడ్డి తెలంగాణ విషయంలో కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఈ ఊహాగానాలకు తెర లేపింది. దానికి తోడు అన్నట్టుగా కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ తాజాగా మర్రికి అనుకూలంగా మాట్లాడడం విశేషంగానే ఉంది. శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని, ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని బలరాం నాయక్ కితాబిచ్చారు.

 

తెలంగాణ ఉద్యమం సాగుతున్నపడు కానీ, టీ కాంగ్రెస్ నేతల సమావేశాలు, సభలు జరిపినప్పుడుకానీ, ఇతర కార్యక్రమాల వైపు చూడని శశిధర్, గత కొంతకాలంగా తెలంగాణపై గళం విప్పుతూ వస్తున్నారు.  ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయవద్దంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చురకలు వేశారు. అసలు ఆయనకు తెలంగాణ ఏర్పాటు కావాలని లేదేమో అని కూడా వ్యాఖ్యానించారు.


తాజాగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనను శశిధర్ తలెకత్తుకున్నారు.  తాను తెలంగాణ వాదిని కానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు అదనంగా మరో 34 నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఆ సంఖ్యను 153కు పెంచాలన్న ప్రతిపాదన తీసుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి 26న షిండేతో పాటు జీవోఎం సభ్యులను, పార్టీ పెద్దలను కలిసి సీట్ల సంఖ్య పెంచాలని, ఆ అంశాన్ని బిల్లులో పొందుపరచాలని కోరతామని శశిధర్ రెడ్డి అన్నారు.