మార్చిలోనే మాడ్చేస్తున్నాయ్.. ముందు ముందు ఎలా ఉంటుందో?
posted on Mar 6, 2023 @ 10:50AM
రాష్ట్రంలో ఎండలు మార్చి లోనే మాడ్చేస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఎల్ నినా ప్రభావంతో ఈ ఏడాది ఎండలు అధికం అని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలను మాత్రం ఎవరూ ఊహించలేదు.
నడి వేసవిలో ఏర్పడే తుపానుల కారణంగా కొద్ది పాటి ఉపశమనం ఉంటుందన్న ఆశలను కూడా ప్రతి తుపాను (యాంటీ సైక్లోన్ ) పరిస్థితులు కలిగే అవకాశం లేకుండా చేస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరిన ఎండలు.. నడి వేసవి వచ్చే సరికి 50 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మధ్య నాటికి జోరందుకోవలసిన శీతల పానియాల విక్రయాలు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్నాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
మార్చి మొదటి వారంలోనే ఎండలిలా మాడ్చేస్తుంటే.. ఇక ఏప్రిల్, మే నెలలలో, రోహిణీ కార్తెలో రోళ్లే పగులుతాయా అన్నంత ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక ఎండలకు తోడు యాంటీ తుపాన్ (ప్రతి తుపాన్) పరిస్థితుల కారణంగా వాతావరణంలో తేమ తగ్గిపోయి, వడగాలులు వీసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదౌతాయి.
ఇప్పటికే ఉదయం 8 గంటలకే ఎండ చుర్రుమంటోది.. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. మండే ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.