రాములమ్మ ఇంటికి ఠాగూర్.. శాంతించేనా?
posted on Nov 4, 2020 @ 9:01PM
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కొత్త ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల నేతలతో ఆయన టచ్ లో ఉంటూ అందరిని యాక్టివ్ చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతోనూ ఆయన మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్యం ఠాగూర్ విజయశాంతి ఇంటికి వెళ్లారు. సుధీర్ఘంగా ఆమెతో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. ఠాగూర్‌కు స్పష్టంగా వివరించారట. రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా.. తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆమె పాల్గొనలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీగా పని చేసిన రాములమ్మ ఆ జిల్లా పరిధిలోని జరిగిన కీలక ఎన్నికలో ప్రచారం చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. పీసీసీ పెద్ద నేతలంతా దుబ్బాకకు వెళ్లగా రాములమ్మ మాత్రం అటువైపు చూడలేదు. ఇక ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆమె సమావేశమయ్యారు. దీంతో విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. కాని అది జరగలేదు. తాజాగా ఆమెను బుజ్జగించేందుకు మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాగూర్ చర్చల తర్వాత రాములమ్మ మెత్తబడినట్లు, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.