మరోసారి రచ్చకెక్కిన మంచు వారి ఫ్యామిలీ ఫైట్
posted on Apr 9, 2025 @ 12:09PM
మంచు ఫ్యామిలీ వార్ మరో సారి రచ్చకెక్కింది. మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించడంతో ఆ కుటుంబ పంచాయతీ మరోసారి రోడ్డున పడింది. తన తండ్రితో మాట్లాడలంటూ మంచు మనోజ్ జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద బైఠాయించడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 9) ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు వద్దకు మంచు మనోజ్ చేరుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే ఇంటి గేటు తెరవకపోవడంతో మనోజ్ ఇంటి ముందే బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు మంగళవారం (ఏప్రిల్ 8) మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారును సోదరుడు మంచు విష్ణుయే తీసుకువెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ బుధవారం (ఏప్రిల్ 9) మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చారు. అయితే లోపలకు అనుమతించకపోవడంతో ఇంటి ముందే బైఠాయించారు.