పేకాట కోసం 50 ఎకరాలు అమ్మేశాడు.. చివరికి డబ్బు లేక...
posted on Dec 12, 2020 9:20AM
జూదం ఒక వ్యసనం.. అది మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. ఒక్కడి వ్యసనంతో కుటుంబం మొత్తం రోడ్డున పడిన ఘటనలు అనేకం మనం చూసాం. అంతేకాకుండా జూదం అనే వ్యసనం ఉన్నవారు ఒళ్ళు పైన తెలియకుండా విచక్షణ కోల్పోయి ఆడేసి చివరికి కట్టుబట్టలతో మిగిలి అప్పులలో మునిగి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చూసాం. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అతడు ఒకప్పడు ఏకంగా 50 ఎకరాల పెద్ద ఆసామి. అయితే పేకాట కోసం ఆ 50 ఎకరాలు కరిగించేసి ఇప్పుడు ఏకంగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. కేవలం తన జూదం వ్యసనం కోసం ఏకంగా ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు కొట్టేశాడు. అయితే అతడి పిల్లలు విదేశాల్లో మంచి ఉద్యోగాలలో స్థిరపడినా అతడు మాత్రం తన వ్యసనం కోసం దొంగగా మారి ఇపుడు సమాజం ముందు దొంగగా తలదించుకుని నిలబడ్డాడు
దీనికి సంబంధించిన పూర్తీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జెక్ కాలనీలోని క్లాసిక్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లోని 501 ఫ్లాట్లో ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి శేషసాయి దంపతులు నివాసం ఉంటున్నారు. గత నవంబర్ 20న వారి ఫ్లాట్ లో విలువైన ఆభరణాల దొంగతనం జరిగింది. ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లెం పగలగొట్టి లోపకిలి వెళ్లిన దొంగ 35 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామాగ్రిని చోరీ చేశాడు. ఇది గుర్తించిన అపార్ట్మెంట్ అసోసియేషన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా విచారణ చేసి పోలీసులు ఈ కేసును ఛేదించారు.
అయితే విచారణ సందర్భంగా దొంగ పూర్వాపరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. ఈ దొంగతనం చేసింది గుంటూరు జిల్లా క్రోసూరు మండలం తాళ్లూరుకు చెందిన రాయపాటి వెంకట్రావు అని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు తెలిపిన వివరాలు విని పోలీసులు కూడా షాకయ్యారు.
ఎప్పటి నుండో పేకాటకు బానిసైన వెంకట్రావు అమరావతిలో ఉన్న 50 ఎకరాల పొలాన్ని అమ్మేశాడట. ఎకరానికి లక్ష చొప్పున అమ్మగా వచ్చిన రూ.50లక్షల మొత్తాన్ని పేకాటకే తగలేశాడట. అరకోటి రూపాయలు పేకాటలో తగలేసిన తరువాత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. తన వ్యసనం కోసం ఏకంగా దొంగతనాలకు దిగాడు. అంతేకాకుండా కేవలం తన పేకాట కోసం వెంకట్రావు బెంగళూరుకు కూడా వెళ్లేవాడట. వ్యసనం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.