నిందితుల వరుస ఆత్మహత్యలు! కీసర లంచం కేసులో అసలేం జరుగుతోంది?
posted on Nov 8, 2020 @ 9:45AM
తెలంగాణలో సంచలనం స్పష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లంచం డిమాండ్ కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి.. కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు ధర్మారెడ్డి. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు.
కోటి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు... గత నెల 14న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ధర్మారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్నట్లు ధర్మారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సెప్టెంబరు 29న ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కీసర మండలం రాంపల్లిలో వేర్వేరు సర్వేనెంబర్లలో 24.16 ఎకరాల భూమికి సంబంధించి నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విలెన్స్ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో ఏసీబీ మరో కేసును నమోదు చేసింది. ఆ భూముల ఫైళ్లు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేసి, పాసు పుస్తకాలు జారీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దానిని విజిలెన్స్ అధికారులకు నివేదించారు.
నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ధర్మారెడ్డితో తహశీల్దార్ నాగరాజు ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ గుర్తించింది. కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, స్థానిక రైతు కందడి ధర్మారెడ్డికి నాగరాజు పాసుపుస్తకాలు ఇచ్చాడు. లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అంజిరెడ్డికి ధర్మారెడ్డి సమీప బంధువు. నలుగురికి పాసుపుస్తకాలిచ్చిన భూమి మొత్తం 24.16 ఎకరాలు అని తెలుస్తోంది. దీని విలువ 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.48.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు.