మైనారిటీ ఓటు పైనే దీదీ ఆశలు
posted on Mar 26, 2021 @ 11:02AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, పెరుగతున్న ఉష్ణోగ్రతలతో పోటీపడి వేడెక్కుతోంది.కాలికి గాయమై కదలలేని పరిస్థితిలోనూ తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసుకుని దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమత, కాంగ్రెస్, కమ్యూనిస్ట్’లతో జట్టుకట్టిన ఇస్లాం ప్రబోధకుడు అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను బీజేపీ సృష్టిగా పేర్కొంటున్నారు. గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన దీదీ చాలా చిత్రంగా పరస్పర వైరుధ్య విశ్వాసాలకు ప్రతీకాగా నిలిచే బీజేపీ, ‘ఐఎస్ఎఫ్’లను ఒకటి చేశారు.
మైనార్టీల ఓట్లను చీల్చేందుకు రాష్ట్రంలో కొత్త పార్టీ ఒకటి పుట్టుకొచ్చిందని, దాని వెనుక బీజేపీ హస్తం ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీకి బీజేపీ నుంచి డబ్బులు కూడా అందుతున్నాయని విమర్శించారు. పేరు ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఇస్లాం ప్రబోధకుడు అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను ఉద్దేశించి పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయొద్దని ఓటర్లను అభ్యర్థించారు.సీపీఎం-కాంగ్రెస్ సైతం బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.
అదలా ఉంటే గురువారం, బాఘ్‌ముండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మమతకు ఏ మాత్రం తీసిపోకుండా, డెంగీ, మలేరియా వ్యాధులతో దీదీ స్నేహం చేస్తున్నారని అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆ వ్యాధులు నిర్మూలన కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు దీదీ ఫ్లోరైడ్ నీటిని సరఫరా చేస్తున్నారు.మీరు ఒక్కసారి దీదీని ఇక్కడి నుంచి పంపిస్తే.. మీకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు బీజేపీ ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయిస్తుంది. గతంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిశ్రమల్ని రాకుండా చేశారు. అందుకే ఉపాధి అవకాశాలు లభించలేదు. మీకు ఉద్యోగాలు కావాలంటే తప్పకుండా బీజేపీకి ఓటెయ్యండి. అలాగే, ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించని బీజీపీ మోడీ పేరున లబ్ది పొందాలని చూస్తోంది, ఈ క్రమమలోనే, మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నికలు కావాలనుకుంటారు. కానీ దీదీ తన మేనల్లుడిని సీఎం చేయడం కోసం ఎన్నికలు కావాలనుకుంటున్నారు’ అని షా తెలిపారు.
ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం 115 స్కీంలు ప్రవేశపెట్టారు. కానీ బెంగాల్‌లో దీదీ 115 స్కాంలు తెచ్చారు అంటూ దీదీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికరంలోకివశే బీజ్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి కింద రూ.18వేలు అందిస్తాం. ఆదివాసీల అభివృద్ధి కోసం మేం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే కేంద్రం ఇక్కడ రైల్వే సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో రవాణా ఉచితంగా కల్పిస్తాం. దీదీ మలేరియా, డెంగీతో స్నేహం చేస్తోంది. వాటిని నిర్మూలన చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి’ అని ఓటర్లకు అమిత్‌షా విజ్ఞప్తి చేశారు.పశ్చిమబెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 6వతేదీ వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.