వైఎస్సార్ సిపికి షాక్ ... ఒంగోలు ఎంపీ మాగుంట పార్టీకి రాజీనామా
posted on Feb 28, 2024 9:21AM
వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాను అంటున్నారు. ఇటీవల పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని.. అనివార్య పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీని వీడాల్సి వస్తోందన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీలో ఉంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే.. ఒక బ్రాండ్ ఉందన్నారు. తమ కుటుంబానికి అహం లేదని.. ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అన్నారు. జగన్‌ను తమ కుటుంబసభ్యుడిగా భావించాంమని.. ఐదేళ్లు సహాయ సహకారాలు అందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల బరిలో ఉండే మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.