హైటెక్ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణం.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్
posted on Sep 1, 2025 @ 12:55PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేక మైన రోజు. ఆయన ఒక్కరికే కాదు.. ఆయనను అభిమానించే కోట్లాది మందికి కూడా ఇది చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కిందట ఆయన తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఔను 1995 సెప్టెంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తరువాత ఆయన మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన మొట్టమదటి సారి ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం ఎవరూ ఎప్పటికీ మరచిపోరు. ఇక ఆయన కుటుంబీకులకు అయితే ఈ రోజు మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎమోషన్ అయ్యారు. తన తండ్రి తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. తన మెంటార్, బాస్ అన్నీ నాన్నే అంటూ ఆయనకు విషెస్ తెలిపారు. హైటెక్ నుంచి క్వాంటమ్ వాలీ వరకూ, బయోటెక్ ఆస్పిరేషన్ నుంచి డేటా ఆధారిత వ్యవస్థల వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
తనకు రాజకీయాలలో ఓనమాలు దిద్దించి, వేలుపట్టుకుని నడిపించిన తండ్రి సాధించిన ఈ ఘనత మైలు రాయికంటే గొప్పదని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో నాన్నా అని పిలుచుకునే చంద్రబాబును పని ప్రదేశంలో బాస్ అని పిలిచే అద్భుత అవకాశం, అదృష్టం తన సొంతమని తండ్రికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.