ఢిల్లీకి లోకేశ్
posted on Sep 15, 2023 7:18AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. అదీకాక రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్ల్‌లో చర్చించేలా టీడీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలో లోకేశ్ మాట్లాడనున్నారని సమాచారం.
మరోవైపు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని.. ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో.. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో ఈ అంశంపై మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించిన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినన్ని అరాచకాలు దేశంలో మరెక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని సోదాహరణగా చూపిస్తూ.... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని.. దీనిపై జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే అదే సమయంలో.. ఏ మాత్రం ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా అధికార ఫ్యాన్ పార్టీ బలవంతంగా రుద్దుతుందో కూడా ఈ సందర్భంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు.. మార్గదర్శి, అమరరాజా వంటి సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. రాష్ట్రంలో అరాచక పాలన గురించి నారా లోకేశ్ వివరిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 73 ఏళ్ల చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా... రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకుండా.. కనీసం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలిసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీ వేదికగా అందరి ముందు ఉంచాలని నారా లోకేష్ బలంగా నిర్ణయం తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ హస్తిన వెళ్లినట్లు తెలుస్తోంది.