రాహుల్ గాంధీ, లోకేష్ ల సమావేశాలలో తేడాలు!
posted on Mar 7, 2013 @ 7:17PM
గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతూ పార్టీ వ్యవహారాలలో క్రమంగా అవగాహన పెంచుకొంటున్న నారా లోకేష్, ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో మొట్ట మొదటిసారిగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి చిన్న ప్రసంగం చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఒకరు అసమర్ధుడు, మరొకరు అవినీతిపరుడు అయినప్పుడు ఎవరికి ఓటేస్తారు?’ అని అడిగారు. సహజంగానే పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పేరు కోరస్ గా నినదించడం షరా మామూలే.
తన తండ్రి చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినప్పటికీ నేటికీ అంతే సమర్ధతతో పార్టీని నిర్వహిస్తూ, ప్రజల కొరకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొంటున్నారని అన్నారు. అందువల్ల తన తండ్రి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకే వచ్చే ఎన్నికలలో తమ పూర్తి మద్దతునీయాలని కోరారు.
అయితే, లోకేష్ కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు, తన తండ్రిని కిరణ్, జగన్ లతో పోల్చడం అనవసరం. అదే సమయంలో తన తండ్రి సమర్ధుడని చెప్పి అతనినే ఎన్నుకోమని కోరడం కూడా అసందర్భ ప్రసంగమే. ఎందుకంటే లోకేష్ తన స్వంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి కాదు. తన పార్టీ కార్యకర్తలనే చంద్రబాబుకి ఓటేయమని కోరడం కొంచెం ఎబెట్టుగా ఉంది. ఎందుకంటే, పార్టీలో పనిచేస్తున్న వారికి ఆవిషయం ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. ఒకవేళ చెప్పవలసివస్తే అటువంటి కార్యకర్తలవల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
ఇంచుమించు లోకేష్ పరిస్థిలోనే ఉన్న కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ నిన్న డిల్లీలో తన కంటే ఏంతో సీనియర్లయిన పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగం చూస్తే, వారిద్దరి మద్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్ధం అవుతుంది. రాహుల్ గాంధీ తన పార్టీ నేతలకు, పార్టీలో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపుతూ, వాటిని ఏవిధంగా పరిష్కరించాలో చెప్పి, పార్టీని గ్రామ స్థాయి నుండి ఏవిధంగా బలపరచాలో, గ్రామీణ కార్యకర్తలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలో తెలియజేసారు. అంతే గాకుండా వారికి స్పష్టమయిన కార్యాచరణ నిర్దేశిస్తూ తగిన ఆదేశాలు కూడా ఇచ్చారు.
ఇక్కడ ఆయన తన సీనియర్లకు ఆదేశాలు ఈయడం అనే అంశం ప్రధానం కాదు. పార్టీ సమావేశంలో ఆయన ఏవిధంగా ఆచరణాత్మక సలహాలు ఇచ్చి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నించారు అనేదే ప్రధాన విషయం.
లోకేష్ కూడా పార్టీ అధిష్టానం తరపున కార్యకర్తలతో మాట్లాడుతున్నపుడు, అదొక సదవకాశంగా భావించి స్థానిక సమస్యలను, పార్టీ పరిస్థితిని, కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని, తన శక్తిమేర సమస్యలని పరిష్కరించడమో లేక పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషిచేస్తే కార్యకర్తలకి, పార్టీకి, తనకీ కూడా ప్రయోజనం కలుగుతుంది.
లోకేష్ కు ఇంకా తగిన రాజకీయ అనుభవం లేనందున, ఆయన చేసిన ఈ తొలి ప్రసంగంలో తప్పులు వెతుకనవసరం లేదు. కానీ, పార్టీ అంతర్గత సమావేశాలలోమాట్లాడవలసిన అంశాలు, బహిరంగ సభలలో ప్రజలనుద్దేశించి మాట్లాడవలసిన విషయాల మధ్యగల తేడాను లోకేష్ తెలుసుకోవడం వల్ల ఆయన మాటలకి ఒక విలువ ఏర్పడి ఆశిస్తున్న ఫలితాలు కనిపిస్తాయి.