తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ ప్రకంపనలు ?
posted on Sep 13, 2022 @ 10:37PM
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం, ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులనే తడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఇందులో పాత్ర ఉందని టీడీపి ఆరోపిస్తోంది. ఢిల్లీలో తీగలాగితే, తాడేపల్లి డొంకంతా కదులు తోందని అంటున్నారు. అలాగే, ఢిల్లీ కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో బయటపడుతున్నాయని చెబుతున్నారు.
సరే, ఆ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముఖ్యమంత్రి సతీమణి భారతి ప్రమేయం ఏమైనా వుందా? విజయ సాయి రెడ్డి పాత్ర ఏమిటి? అనేది, సిబిఐ విచారణలో తేలుతుంది. అంతవరకు ఎవరు ఏది చెప్పినా, ఏ ఆరోపణ చేసినా, అది ఉహజనితమే అవుతుంది. అయితే, ఢిల్లీ కుంభకోణంతో ప్యాలెస్ సంబంధాల ప్రకంపనలు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి సతీమణి భారతి టార్గెట్’గా ఆరోపణలు చేస్తున్నా, మంత్రులు ఎవరూ స్పందించక పోవడాన్ని, ముఖ్యమంత్రి నేరంగా పరిగణించి, శిక్ష తప్పదని హెచ్చరించడం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు ప్యాలెస్ లో ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే, రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డిని మెల్లమెల్లగా దూరం పెడుతున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, భారతి పేరుతొ పాటుగా విజయసాయి రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డికి ప్యాలెస్ ఎంట్రీ లేదని వస్తున్న వార్తలు అనుమానాలు ఇంకొంత పెంచుతున్నాయి.
అదలా ఉంటే, ఇప్పడు కొత్తగా ఇంకొక వార్త వినవస్తోంది. జగన్ రెడ్డి, విజయసాయి మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో సజ్జల మరోమారు,, ప్యాలెస్ పాలిటిక్స్ లో పై చేయి సాధించారని, అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా అంటే ముందు నుంచి కూడా విజయసాయి రెడ్డి పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే చెప్పాపెట్టకుండా, సోషల్ మీడియా బాధ్యతలను, సజ్జల టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి అదేశాల మేరకు సోషల్ మీడియాలో మార్పులు చేర్పులు జరిగినట్లు చెపుతున్నారు. విజయసాయి రెడ్డి బాధ్యతలను మరో ముఖ్యనేత కుమారుడికి అప్పగించారని తెలుస్తోంది.
నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ కోసం చాలా కాలంగా, సజ్జల, విజయసాయి మధ్య పోటీ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సర్వం విజయసాయి చేతుల్లోనే ఉండేది. అయితే విశాఖ ఎల్జీ పాలిమర్స్’లో ప్రమాదం సంభవించిన సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రితో పాటు బయలుదేరిన విజయ సాయి రెడ్డిని కారు దించి వెనక్కి పంపించడంతో మొదలైన జగన్ రెడ్డి బొమ్మా బొరుసు ఆట .... చాలా చాలా మలుపులు తిరిగింది. విజయసాయి ముఖ్యమంత్రికి దూరమయ్యారు. సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గరయ్యారు. సర్వ శాఖల మంత్రిగా చక్రం తిప్పారు. విజయసాయి పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు.తర్వాత ఏమైందో కానీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కూడా ఆయనకే అప్పగించారు.కానీ ఇప్పుడు అనధికారికంగా అయినా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటున్నారు.
ఈ మార్పుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరు పైకి రావడమే ప్రధాన కారణం అంటున్నారు.
విజయసాయి రెడ్డి ప్రమేయంతోనే భారతి పేరు బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ఆయన్ని దూరంగా ఉంచుతున్నారని అంటున్నారు. నిజానికి గతంలోనూ జగన్ రెడ్డి విజయసాయి విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నా, ముఖ్యమంత్రి సతీమణి భారతి జోక్యంతో విజయసాయి పోయిన ప్రాధాన్యతను తిరిగి తెచ్చుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పడు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి పేరుతొ పాటు భారతి పేరు కూడా బయటకు రావడంతో, ఇప్పుడు ఆమె విజయసాయిని బయట పడేసే అవకాశమే లేదని అంటున్నారు. సో .. జగన్ రెడ్డి పరమ పద సోపాన పటంలో మరోమారు, సాయి డౌన్ అయ్యారు. సజ్జల నిచ్చెన ఎక్కారు , అంటున్నారు.