తండ్రి తీరు... పుట్టబోయే పిల్లల్నీ వదలదు
posted on Feb 12, 2019 @ 11:15AM
పిల్లల్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని తల్లికి ఆపాదించడం చాలా తేలికే! కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసే పరిశోధనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయం, వారి తల్లుల మీదే కాదు... తండ్రుల తీరు మీద కూడా ఆధారపడి ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధననే తీసుకోండి. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ జోనా కిటలిన్‌స్కా పరిశోధన ప్రకారం... తండ్రిలో తాగుడు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిన ఎదుర్కొనే సామర్థ్యం, వయసు... ఇవన్నీ కూడా వాళ్ల వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. తద్వారా పుట్టబోయే పిల్లల జన్యువుల మీద ప్రభావం చూపుతాయంటున్నారు జోనా. ఈ మార్పు కేవలం ఒక్క తరానికే పరిమితం కాదట. భవిష్యత్ తరాలు అన్నింటి మీదా ఈ ముద్ర ఉంటుందని తేల్చి చెబుతున్నారు జోనా.
జోనా అంచనా ప్రకారం తండ్రికి మితాహారాన్ని తీసుకునే అలవాటే కనుక ఉంటే, అతని పిల్లల్లో గుండెజబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాళ్లు కనుక ఊబకాయులై ఉంటే కనుక, అది వారి పిల్లల్లోని కొవ్వుకణాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి కొవ్వు కణాలతో పుట్టిన పిల్లల్లో మున్ముందు చక్కెర వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తండ్రుల వయసు కూడా పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుందట. మరీ లేటు వయసులో జన్మనిచ్చే తండ్రుల వల్ల, పిల్లల మెదడుకి తిప్పలు తప్పవంటున్నారు జోనా. ఆటిజం, స్కిజోఫ్రీనియాతో పాటుగా పుట్టుకలో లోపాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. దీనిని బట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనే మన పెద్దల మాట ఎంత విలువైందో అర్థమవుతోంది కదా! చదువు, కెరీర్ అంటూ పెళ్లినీ పిల్లల్నీ వాయిదా వేసుకుంటూ పోతే పుట్టబోయే వారికి ఇబ్బందే!
పిల్లల మీద తండ్రుల ప్రభావం విషయంలో జోనా సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం తాగుడు. మగవాడికి తాగే అలవాటు ఉంటే కనుక అది అతని పిల్లల మెదడు పరిమాణం మీదా, మేధస్సు మీదా ప్రభావం చూపుతుందట. ఇలా కేవలం శారీరికమైన అలవాట్లే కాదు, తండ్రుల మానసిక ధోరణి కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుందని జోనా పరిశోధనలో తేలింది. మగవాడిలో త్వరగా ఒత్తిడికి లోనయ్యే గుణం ఉంటే, అతనికి పుట్టబోయే పిల్లల్లో ప్రవర్తనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తేలింది.
దండీ విషయం! దీనిబట్టి పిల్లల్ని కనాలనుకునే తల్లులే కాదు, తండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తేలిపోతోంది. మితమైన ఆహారం, మానసిక ప్రశాంతత, వ్యసనాలకు దూరంగా ఉండటం, వ్యాయామం... ఇవన్నీ కేవలం మన ఆరోగ్యాన్నే కాదు... మనకు పుట్టబోయే పిల్లల జీవితాన్నే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకుంటే చాలు. మంచి జీవనశైలిని గడపాలన్న లక్ష్యం ఏమంత కష్టంగా తోచదు!
- నిర్జర.