మోదీ సార్.. పెన్సిల్ కొనుక్కునేదెలా?
posted on Aug 1, 2022 @ 4:49PM
కృతీ దూబే తల్లి కొట్టిందని రివ్వున గదిలోకి పారిపోయింది. తల్లి తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్లింది. కృతీకి కన్నీళ్లు ఆగడం లేదు. తల్లిమీద కోపం కాదు పెన్సిల్ పోయిందని. ఏ సోనీ గాడో కొట్టేసుంటాడనే అనుమా నమూ పిల్లకి రాకపోలేదు. ఇప్పటికే చాలా పోయాయి. మళ్లీ కొనమంటే వీపు విమానం మోత మోగుతుంది. అసలు దీనంతటికి కారణం పెన్సిలు ధర పెరగడమే!
అంతే వెంటనే నోట్‌బుక్ కాయితం అమాంతం చింపింది. వేళ్లు నొప్పులు పెడుతున్నా పెద్దపెన్సిలు పట్టి ఉత్తరం రాసింది. బుగ్గలమీంచి కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉత్తరం రాయడం ముగించింది. కోపం కాస్తంత తగ్గింది. ఉత్తరం ఎలా పంపించాలన్న ఆలోచనతో కాస్తంత మనసు శాంతించింది.
ఇంతకీ యూపీ కనౌజ్ జిల్లా చిబ్రమౌ పట్టణానికి చెందిన ఆరేళ్ల కృతి ఆ ఉత్తరాన్ని వాళ్ల డాడీకి రాయ లేదు.. అమ్మని తిట్టమని, అమ్మని కొట్టమని అమ్మమ్మకీ రాయలేదు .
ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కే రాసేసింది! అసలు ఆలోచన రావడమే గొప్ప వింత. సరే ఇంతకీ ఏమి రాసిందో తెలుసా ఇలా ప్రతీ వస్తువు ధరలూ పెంచేస్తారేంటి అని!
సారూ.. నా పేరు కృతీ దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు బాగా పెంచుతున్నారు. పెన్సిల్, ఎరేజర్ కాస్ట్‌లీ అయ్యాయి. వీటిని పోగొట్టుకుంటే అమ్మ నన్ను కొడుతోంది. పెన్సిల్, ఎరేజర్‌ను రేప్పొద్దున తరగతి గదిలో ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయను?. మ్యాగీ ధర కూడా బాగా పెరిగింది’ అని.
లేఖలో చివరగా మ్యాగీ ధర కూడా ప్రస్థావించడం విశేషం! ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.