నీటిలో వేట.. చిరుత ఆట!
posted on Dec 8, 2022 @ 10:10AM
అత్యంత వేగంగా పరుగెత్తే చిరుత పులి.. అంతే వేగంగా తన వేట సాగిస్తుంది. అది నేలమీదా.. నీటిలోనా అన్న తేడా లేదు. వేటాటలో ఎంతకైనా తెగిస్తుంది. ఎంత ఓపికగానైనా ఎదురు చూస్తుంది. చిరుతపులి అంటే మజాకా కాదు. వేటాడడంలో దాని స్టైలే వేరు.
జనావాసాలలో కూడా దర్జాగా తిరుగుతూ జనానికి దొరక్కుండా తప్పించుకుని మరీ ఆవులూ, దూడలను దొరకబుచ్చుకుని భోం చేస్తుంది. అందుకే జనం చిరుతపులి సంచారం చేస్తోందనగానే గుండెలు చేత్తో పట్టుకుని భయం భయంగా గడుపుతారు. అటవీ అధికారులు ఆ చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేసేదాకా నిద్ర లేని రాత్రులు గడుపుతారు.
అయితే చిరుత నీటిలో కూడా వేటాడుతుందనీ, ఆహారం కోసం నీటిలో ఊపిరిబిగపెట్టి ఎదురు చూసే నైపుణ్యం దానికి ఉందనీ తెలియజేసే వీడియో ఒకటి తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో ఎవరు పెట్టారు? ఎప్పుడు పెట్టారు అన్న స్పష్టత లేదు కానీ చిరుత నీటిలో వేగంగా కదులుతూ తన ఆహారాన్ని నోట కరచుకుని నీటి అడుగునే తింటున్న దృశ్యం నెటిజన్లను ఆశ్చర్య చకితులను చేసింది. చిరుతా మజాకానా అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.