వైసీపీ నుంచి వలసల వెల్లువ.. దేశం గూటికి కొలుసు
posted on Jan 11, 2024 @ 12:29PM
కొలుసు సైకిల్ సవారీ.. ముహూర్తం కన్ ఫర్మ్
ఫలించని బుజ్జగింపులు.. పార్టీ వీడేందుకే మొగ్గు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ
తలలు పట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏదో సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు. అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అది సినిమా కనుక డైలాగ్ బాగా పేలి హిట్ అయ్యింది. అయితే జగన్ ఇప్పుడు నిన్నటి దాకా తానే దేవుడిని, తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేసరికి కొంచం మాట మార్చాడు. సినిమా డైలాగ్ ను తలపించేలా ఐప్యాక్ శాసించింది.. నేను పాటిస్తున్నాను అంటూ చెబుతున్నారు. అలా చెబుతూ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.
దీంతో వారిలో చాలా మంది ఒక్కొక్కరూ ఒక్కో రఘురామకృష్ణంరాజుగా మారిపోతున్నారు. అంటే పార్టీలో రెబల్స్ గా మారిపోతున్నారు. అంతే కాదు.. పార్టీ వీడడానికి రెడీ అయిపోతున్నారు. తాము ఏ పార్టీలో చేరినా, అక్కడ అంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ లభించినా, లభించకపోయినా, వైసీపీ ఓటమే లక్ష్యంగా పని చేయడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా ఈ వరుసలో ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పార్ధసారథి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు. పార్ధసారథి టీడీపీలో చేరనున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. వైసీపీ పెద్దలు బుజ్జగింపులు పర్వం కూడా సాగింది. మంగళ, బుధవారాలలో వైసీపీ పెద్దలు సారథిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. వైసీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి సారథితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా పార్ధసారథి పార్టీ తీరుపైన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసి గుడ్ బై చెప్పడానికే రెడీ అయ్యారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పార్థసారథితో వైసీపీ బుజ్జగింపులు ఫలించలేదు. వైసీపీలో ఇక కొనసాగలేనని పార్టీ నేతలకు కూడా పార్థసారథి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇప్పటికే వైసీపీ పెద్దలు మూడు దఫాలుగా సారథితో సమావేశమయ్యారు. ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు లతో భేటీ అనంతరం సారథి సీఎంవోకి వెళ్లి జగన్ ను కూడా కలిశారంటున్నారు. అయితే ఆయనకు జగన్ ను కలిసే అవకాశం లభించలేదన్న సమాచారం కూడా వస్తోంది. ఏం జరిగిందీ అన్ననది.. అంటే జగన్ తో కొలను పార్థసారథి భేటీ అయ్యారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆయన తాడేపల్లి ప్యాలస్ కు వెళ్లారు. ఆ తరువాత మరింత గట్టిగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అలాగే టీడీపీలో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడలోని తన కార్యాలయంలో టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావులు పార్థసారథితో భేటీ కావడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రా కదలి రా బహిరంగ సభలో కొలుసు పార్థసారథి తెలుగుదేశం కండువా కప్పుకుంటారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడడం నిస్సందేహంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రభావంతో ఈ జిల్లా ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో పార్థసారథి లాంటి సీనియర్లు పార్టీని వీడితే ఈ జిల్లాలో వైసీపీకి కోలుకోవడం అసాధ్యమే అవుతుందంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి కమ్మ సామజిక వర్గం అధిక ప్రభావం చూపే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక బీసీ నేతగా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్, ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, రాజకీయాలలో విస్తృత స్నేహాలు ఉన్న కొలుసు పార్థ సారథి జిల్లా రాజకీయాలలో తనదైన ప్రభావాన్ని చూపగలరు. అధిష్ఠానం ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని ఇటీవలే వైసీపీకి స్పష్టమైన హెచ్చరిక కూడా చేశారు. ఇటీవల పోరంకిలో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సందర్భంగా జరిగిన సభలో ఆయన పార్టీ టిక్కెట్టు రాకుంటే పెనమలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చాటారు. అంటే టికెట్ ఇవ్వకుంటే వైసీపీతో తెగతెంపులు చేసుకుంటానన్న సంకేతాన్ని ఆయన ఎప్పుడో పార్టీకి ఇచ్చారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. టీడీపీ ఆహ్వానం పలకడంతో ఆయన టీడీపీతో కలిసి నడిచేందుకు రెడీ అవుతున్నారు.
ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ నేతల చూపు ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉంది. అసలే ప్రభుత్వ వ్యతిరేకత, రాజధానిపై జగన్ నిర్ణయం, ఇప్పుడు ఈ ఇన్ చార్జీల మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవ్వడమేబెటర్ అన్న భావన వ్యక్తం అవుతోంది. పార్టీలలో అవకాశాల వేటలో ఉన్న ఈ నేతలలో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోవడానికి రెడీ అయిపోతున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో అవకాశం ఉండదని భావించిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటీవలే అంటే రెండు మూడు రోజుల నుంచే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత నుంచే ఏపీలో కాంగ్రెస్ రాజకీయం మొదలు అయ్యింది. అంతే వెంటనే ఆ పార్టీలోకి కూడా భారీగా చేరికలు జరిగాయి. బుధవారం (జనవరి 10) విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మరో రెండు వారాలలో కాంగ్రెస్ గేట్లు కూడా చేరికల కోసం పూర్తిగా ఎత్తేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.