ఫ్యామిలీ ప్యాకేజీకి కేసీఆర్ నో!.. ఈ విధానం కల్వకుంట్ల ఫ్యామిలీకి వర్తించదా?
posted on Mar 7, 2023 @ 2:07PM
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలో నేతల వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు.. గతంలో తాను చెప్పినట్లు సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని తేల్చేశారు. ఈ సారి చావో రేవో అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామనీ, రాష్ట్రంలో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి తీరాలని ఆయన పార్టీ నేతలకు విస్పష్టంగా చెప్పేశారు.
అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లని స్పష్టం చేసేశారు. నియోజకవర్గాల వారీగా గెలిచే అభ్యర్థులు ఎవరన్న సంగతి తేల్చుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని కేసీఆర్ ఇచ్చిన హామీలో ధీమాగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలలో ఇప్పుడు గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తమ రోజు వారీ దినచర్యను మార్చుకున్నారు. రోజూ జనంలో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అయినా ఏదో బెంగ వారిలో కదలాడుతోంది.
ఇక కొందరు సీనియర్ నాయకులు ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో తమ వారుసుల రాజకీయ అరంగేట్రం కోసం చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ చెక్ పెట్టేశారు. వారసులకు టికెట్లిచ్చే ప్రశ్నే లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్యామిలీలో ఒకరికే టికెట్ అని, ఇది విధానపర నిర్ణయమని కేసీఆర్ చెప్పేయడంతో సీనియర్ల ఆశలు వమ్మయ్యాయి.
అయితే ఈ విషయంలో పార్టీ సీనియర్లలో ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తమౌతోంది. ఫ్యామిలీ ప్యాకేజీలకు నో అన్న పార్టీ విధానం అధినేతకు వర్తించదా అని పలువురు నాయకులు గొణుక్కుంటున్నారు. ఫ్యామిలీలో ఒకరికే పార్టీటికెట్ అని స్పష్టం చేసిన కేసీఆర్ అది కూడా సర్వేల ఫలితాన్ని బట్టి గెలుస్తారనుకుంటేనే టికెట్ ఇస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు.