Read more!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం కాదు.. నీతి ఆయోగ్ సిఫారసు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. వారి ప్రసంగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా  వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన, ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే మెగా డీఎస్సీపైనే తన తొలలి సంతకం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ ను, ఆయన సర్కార్ ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదనీ, దానిని రద్దు చేయడం సాధ్యం కాదనీ పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.  అయతే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణననలోనికి  తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతీ ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమలులోకి తీసుకువచ్చేసింది.  

తాను కూడా ఆ చట్టానికి బాధితుడినేనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి  పూర్తిగా ఉంది. అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు.