లక్ష్మీ రావే మా ఇంటికి!
posted on Oct 8, 2024 @ 9:30AM
లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు.
అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!!
అనవసరపు ఆడంబరాలు వద్దు!!
కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.
సింప్లిసిటీ!!
నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు.
పొదుపు సూత్రాలు!!
నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!!
ఇన్వెస్ట్మెంట్!!
చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి.
వ్యాపారాలు!!
ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.
పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.
◆వెంకటేష్ పువ్వాడ.