పార్కింగ్ స్థలం కోసం కూటమినేతల ఘర్షణ
posted on Aug 23, 2025 @ 12:44PM
విజయవాడ కనకదుర్గ నగర్ లో పార్కింగ్ స్థలం విషయంలో స్థానిక కూటమి నేతలు ఘర్షణకు దిగారు. కనకదుర్గ నగర్ లో కొన్ని షాపులను మున్సిపల్ అధికారులు గతంలో తొలగించారు. అక్కడ అంతకు ముందు ఆటో స్టాండ్ ఉండేది. ఆటో స్టాండ్ కి సంబంధిచిన కొంతమంది ఆటో డ్రైవర్లు ఒక దిమ్మెను నిర్మించి దాని ప్రారంభానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీ రామ్ ను ఆహ్వానించారు . ఇదే ప్రాంతంలో తెలుగుదేశంకి చెందిన మైలవరపు వీరబాబు నగరపాలక సంస్థకు డబ్బులు చెల్లించి పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారు.
తాను మున్సిపాలిటీ కి అద్దె చెల్లించి ఏర్పాటుచేసుకున్న పార్కింగ్ స్థలం వద్ద దిమ్మెను తొలగించాలని వీరబాబు ప్రారంభ కార్యక్రమానికి అడ్డు తగిలారు. దీంతో అక్కడికి వచ్చిన బీజేపీ నేత శ్రీరామ్ అభ్యం తరం చెబుతూ పార్కింగ్ స్థలాన్ని తాము ఆక్రమించలేదనీ, దిమ్మె ప్రారంభానికి అడ్డురావద్దని చెప్పారు. దీంతో మైలవరం వీరబాబు ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన దిమ్మను పగలగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.