ఎమ్మిగనూరు టిక్కెట్ పై కోట్ల -టిజి మధ్య విభేదాలు
posted on Mar 14, 2012 @ 12:56PM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి కేటాయించాలన్న విషయంపై పార్లమెంట్ సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్రమంత్రి టిజి వెంకటేష్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ టిక్కెట్ ను ఇటీవల టిడిపి నుంచి కాంగ్రెస్ చేరిన రుద్రగౌడ్ కు ఇప్పించేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలను మంత్రి టిజి వెంకటేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపి నుంచి కొద్ది కాలం క్రితమే కాంగ్రెస్ లో చేరిన రుద్రగౌడ్ కు టిక్కెట్ ఇస్తే ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న నాయకులకు ద్రోహం చేసినట్లు అవుతుందని టిజి అంటున్నారు.
ఒకవేళ రుద్రగౌడ్ కు టిక్కెట్ ఇస్తే పార్టీలోని మిగిలిన శ్రేణులు ఆయనకు వ్యతిరేఖంగా పనిచేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాక పార్టీని ఎప్పటినుంచో అంటిపెట్టుకుని ఉన్న తిక్కారెడ్డికి ఎమ్మిగనూరుకాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని మంత్రి టిజి అధిష్టానాన్ని కోరుతున్నారు. తిక్కారెడ్డి అభ్యర్థిత్వాన్ని కోట్ల సూర్యప్రకాష్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎమ్మిగనూరులో కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికీ ఇవ్వాలన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో వైయాస్సార్ కాంగ్రెస్ కు పట్టుండగా పట్టణ ప్రాంతాల్లో టిడిపికి బలం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఎవరు ఎక్కువగా ఓట్లు పోల్ చేయించుకుంటే వారు గెలిచే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.