చంద్రబాబు ఇంటికి కరెంట్ కట్!
posted on Feb 26, 2021 @ 10:24AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తీరు దారుణంగా తయారైంది. టీడీపీ నేతలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పైనా నీచంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
చిత్తూరు అధికారుల తీరుపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమర్నాథరెడ్డిహెచ్చరించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.