ప్రాణాలతో పోరాడి ఓడిన నిరుద్యోగి.. కేసీఆర్ చేసిన హత్యేనన్న సంజయ్
posted on Apr 2, 2021 @ 12:10PM
ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసి... నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధి సునీల్ చనిపోయాడు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన బోడ సునీల్ అనే యువకుడు మార్చి 26న కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సునీల్.. శుక్రవారం ఉదయం కన్నుమూశాడు.
వరంగల్ రూరల్ జిల్లా గూడూరు మండలం, తేజావత్ రామ్సింగ్ తండాకు చెందిన సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే వాడు.. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విద్యార్ధులు ముఖ్యమంత్రిని విడిచిపెట్టొద్దని చెప్పాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
బోడ సునీల్ ఆత్మహత్యాయత్నం ఘటన తెలంగాణలో దుమారం రేపింది. సునీల్ ను విపక్ష నేతలు పరామర్శించారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సునీల్ ఘటనకు టీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడి మరణించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ కుటుంబాన్ని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇది సీఎం కేసీఆర్ చేసిన హత్యని అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సీఎం గానీ, మంత్రులు గానీ ఎవరూ ఆ పేద కుటుంబానికి బరోసా ఇవ్వలేదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ఉద్యోగం లేకుండా బతకలేరని, రాష్ట్రంలో చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు లేవని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ మాయమాటలు చెబుతారని, ఎన్నికలు అయిన తర్వాత మరిచిపోతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలని సంజయ్ అన్నారు. ఆనాడు అనేకమంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, ఈనాడు సీఎం తన పదవిని కాపాడుకోవడం కోసం అనేకమందిని బలితీసుకుంటున్నారని విమర్శించారు. దయ చేసి విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని బండి సంజయ్ సూచించారు