బీసీ రిజర్వేషన్ బిల్లుకు వంద శాతం మద్దతు కానీ.. అసెంబ్లీలో కేటీఆర్
posted on Aug 31, 2025 @ 12:17PM
పంచాయతీ రాజ్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లకు వీలు కల్పంచే బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బిల్లుకు ఆమోదం తెలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం తమకు ఇష్టం లేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బీసీలకు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్ గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్న కేటీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీలో మూడు ప్రొటోకాల్ పదవులను బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవ రణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ మద్దతు వంద శాతం ఉంటుందని కేటీఆర్ సభా ముఖంగా ప్రకటించారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకోసం అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ కలిసి చర్చిస్తే అరగంటలో బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేటీఆర్ అన్నారు.