ఉపముఖ్యమంత్రిగా కేటీఆర్.! ఆ తర్వాత నేరుగా సీఎం కుర్చీయే.!
posted on Feb 6, 2020 @ 10:20AM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ దాదాపు ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు సైతం ఈమధ్య కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరేనంటూ ప్రకటనలు కూడా చేశారు. ఐటీ అండ్ మున్సిపల్ మంత్రిగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్న కేటీఆర్... ఏదోఒక రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు ముగిశాక మంచిరోజు చూసుకుని కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ఖండించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కొట్టిపారేశారు. అయితే, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కేటీఆర్ కోసం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేశారట. ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకుండా.... ఉపముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యనేతలతో తన మనసులో మాటను కేసీఆర్ బయటపెట్టారని అంటున్నారు. కేటీఆర్ ను డిప్యూటీ సీఎంను చేస్తే ఎలాగుంటుందంటూ అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, గత ప్రభుత్వంలో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్... రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవరికీ డిప్యూటీ సీఎమ్ లుగా అవకావమివ్వలేదు. అయితే, ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకంగా తీసుకునే కేసీఆర్.... ఈసారి ఉపముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ కోసం రిజర్వు చేశారని అంటున్నారు. ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఇప్పుడు కేటీఆర్ ను ఉపముఖ్యమంత్రిని చేయనున్నారని అంటున్నారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం హోదాలో కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ముఖ్యమంత్రి లేనిసమయంలో అవసరమైతే మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించవచ్చని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని కీలక ఫైల్స్ పై సంతకాలు చేసే అధికారం ఉంటుందని అంటున్నారు. ఈవిధంగా పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ కేటీఆర్ ను కీలకం చేయడం వల్ల కేటీఆరే ఫ్యూచర్ సీఎం అంటూ అటు పార్టీని, ఇటు ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేయబోతున్నారని విశ్లేషిస్తున్నారు.
అయితే, ఎవరేమనుకున్నా డేంట్ కేర్ అంటూ కేటీఆర్ ను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేసే అధికారం కేసీఆర్ కు ఉంది. కానీ, ఉన్నట్టుండి కేటీఆర్ ను సీఎంను చేస్తే కొందరు సీనియర్ల నుంచి వ్యతిరేకత రావొచ్చు. అది చివరికి ఎటువైపైనా దారి తీయొచ్చు. అందుకే, కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తనయుడు కేటీఆర్ ను ఒకేసారి ముఖ్యమంత్రిని చేయకుండా ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ ఫైనల్ గా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి, త్వరలోనే కేటీఆర్... డిప్యూటీ సీఎం హోదాకి ప్రమోషన్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. అలా, కొన్నాళ్లు ఉపముఖ్యమంత్రి పదవి నిర్వహించాకే... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశముందంటున్నారు.