ముఖ్యమంత్రి పదవిపై కేటీఆర్ ఏమన్నారంటే...
posted on Jan 2, 2020 9:10AM
త్వరలోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగనుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఈ ఏడాది తాను ముఖ్యమంత్రి అవుతానంటూ జరుగుతోన్న చర్చ అర్ధంలేనిదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో పదేళ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందన్నారు. 2030వరకు టీఆర్ఎస్ ను ఎవరూ కదిలించలేరని ధీమా వ్యక్తంచేశారు. 2019 తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందన్న కేటీఆర్... 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి శుభారంభం చేస్తామని అన్నారు.
ఎన్పీఆర్, ఎన్నార్సీలపై ఎలా వ్యవహరించాలో... తమ విధానమేంటో... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక, ఏపీ సహా పొరుగు రాష్ట్రాలన్నింటితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. అయితే, ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని, ఇందులోనూ రాజకీయాలు చేయాలనుకుంటే అది దేశానికి మంచిది కాదన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల కల సాకారం కావాలంటే రాష్ట్రాలను మరింత ప్రోత్సహించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇక, ఇప్పటికీ కాంగ్రెస్సే తమకు ప్రధాన ప్రత్యర్ధి అంటూ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, ఆ పార్టీని తక్కువ అంచనా వేయబోమన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ తన చిన్నప్పుడు ఎలాగుందో... ఇప్పుడూ అలాగే ఉందంటూ కాషాయ బలాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇక, ఎంఐఎంతో స్నేహసంబంధాలు ఉంటాయే తప్ప.... ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉండదన్నారు. అంతేకాదు రాజకీయాల్లో తమకు శత్రువులు ఎవరూ లేరని.... కేవలం ప్రత్యర్ధులు మాత్రమే ఉన్నారని అన్నారు.