కేటీఆర్ రాజీనామా చేస్తారా? ఆయన ఏం చేయబోతున్నారు?
posted on Sep 14, 2021 @ 7:03PM
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేయడానికి సిద్ధమయ్యారా? ఆయన నోట రాజీనామా మాట ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. గద్వాల జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం సంచలనంగా మారింది. కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పాదయాత్ర చేస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ .. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కామెంట్ చేశారు. సంజయ్ చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చిన కేటీఆర్.. రాజీనామా సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలన్నారు కేటీఆర్. నేను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా... మీరు చెప్పినవి తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
గత ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ చెప్పారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ సవాల్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ సవాల్ ను స్వీకరించి సంజయ్ చర్చకు వస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. కేటీఆర్ సవాల్ ను బండి సంజయ్ స్వీకరిస్తే ... నిధుల అంశంపై వాడీవేడీ చర్చ సాగే అవకాశం ఉంది.