బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్న కేటీఆర్?!
posted on Jan 18, 2024 8:56AM
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురి మళ్లీ తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. సహజమే. చేయాలి కూడా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీల అమలుపై, కాంగ్రెస్ చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుపై ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలోనే ఆయన చాలా తొందరపడుతున్నారనుకుంటే, కాంగ్రెస్ పాలనలోని తప్పులను ఎత్తి చూపాలన్న ఆత్రం తొందరలో ఆయన తమ ప్రభుత్వ తప్పులను స్వయంగా బయటపెట్టుకుంటున్నారు. అలా ఆయన రేవంత్ సర్కార్ ను తప్పుపట్టడానికి చేస్తున్న విమర్శలు గురి తప్పి తమ సర్కార్ వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నాయని గ్రహించలేకపోతున్నారు.
తాజాగా కేటీఆర్ సర్పంచ్‌లకు చెల్లించే జీతాల బకాయిలపై ప్రభుత్వానికి ఓ డిమాండ్ పెట్టారు. నాలుగేళ్లుగా ఉన్న బకాయిలను చెల్లించాలని, వాటిని చెల్లించకపోతే పోరాటం చేస్తానని రేవంత్ సర్కార్ కు అల్టిమేటమ్ ఇచ్చారు. కేటీఆర్ రేవంత్ సర్కార్ కు ఇచ్చిన వార్నింగ్ పై బీఆర్ఎస్ పార్టీ నేతలే నెత్తి కొట్టుకుంటున్నారు. తలలు బాదుకుంటున్నారు. నాలుగేళ్లుగా సర్పంచ్‌లకు సొమ్ములు చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రశ్న ఎదురౌతుందన్న విషయం ఆయనకు ఎందుకు తెలియలేదని తలలు బాదుకుంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరి ఎన్ని రోజులైందన్న విషయం ఆయనకు తెలియదా? లేదా విపక్షంలో ఉన్నాం కనుక ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకున్నారా? అని బీఆర్ఎస్ నేతలే అంతర్గత సంభాషణల్లో తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి నిర్వాకంపై జోకులేసుకుంటున్నారు. అసలు సర్పంచ్ లకు నాలుగేళ్లుగా జీతభత్వాలు చెల్లించకుండా బకాయిలు పెట్టిందెవరు? అత్యంత ధనిక రాష్ట్రం అని డప్పాలు కొట్టుకున్న కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్‌లకు బకాయిలు లేకుండా ఎందుకు చెల్లింపులు చేయలేదని కాంగ్రెస్ నిలదీస్తుందన్న కనీస ఇంగితాన్ని కూడా కేటీఆర్ కోల్పోయారా? అధికారానికి దూరం కావడంతో సోయలేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సరిపోతుందనుకుంటున్నారా అని రాజకీయవర్గాలు విస్తుపోతున్నాయి.
నిజమే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు, పడిన బకాయిలకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందులో సందేహం లేదు. ప్రభుత్వం, పాలన అనేది నిరంతరాయ ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆటంకం లేకుండా కొనసాగే విషయం. సర్పంచ్‌ల బాకీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిందే. అందులో సందేహం లేదు. అయినా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరి నెల రోజులు దాటిందంతే.. కానీ కేటీఆర్ విమర్శలు, వ్యాఖ్యలు చేస్తుంటే.. తమ ప్రభుత్వం తప్పు చేయడానికీ, తమ ప్రభుత్వ తప్పిదాలకూ కూడా కాంగ్రెస్ కారణమన్నట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ నిన్న మొన్నటి వరకూ అంటే 2013 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ అధాకారంలో ఉన్నది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వమే. విపక్షంలో కూర్చోగానే ఆ విషయాన్ని విస్మరించి, గత నాలుగేళ్ల బకాయిల చెల్లింపులో రేవంత్ సర్కార్ విఫలమైందన్నట్లుగా విమర్శలు గుప్పించడాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్ సర్పంచ్ ల జీత భత్యాల బకాయిలపై రేవంత్ సర్కార్ ను నిలదీయడాన్ని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ తప్పు పట్టారు. కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత మంది సర్పంచ్‌లు ఆస్తులు అమ్ముకున్నారని, మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసిన ఆయన దీనికి కేసీఆర్, కేటీఆర్ లు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. సామాన్యజనం, ఆఖరికి బకాయిలు రావలసిన సర్పంచ్ లు కూడా కేటీఆర్ తీరును ప్రశ్నిస్తున్నారు. మీరు చేసిన తప్పులన్నిటినీ రేవంత్ సర్కార్ సరి చేస్తున్నదనీ, అయితే నాలుగేళ్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదంటూ నెలబాలుడి లాంటి నెల రోజుల రేవంత్ సర్కార్ ను నిలదీయడమేంటని ప్రశ్నిస్తున్నారు.