బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మా కారణమేంటి?
posted on Dec 14, 2022 @ 10:52AM
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలంగా వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్..చివరికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేసేశారు. తన కొత్త పార్టీ కేద్ర కార్యాలయాన్ని హస్తినలో బుధవారం (డిసెంబర్ 14) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు. అయితే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం తన హస్తిన పర్యటనను చివరి నిముషంలో రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకోవడానికి జపాన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవమే కారణమని బయటకు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఆవిర్బావానికి ముందు నుంచీ కూడా తెరాసలో లుకలుకలు ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య అంతగా పొసగడం లేదన్న ప్రచారమూ ఉంది. అందుకే కేసీఆర్ ‘జాతీయ’ బాట పట్టారనీ కూడా అంటున్నారు. నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు.
నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే, “ కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని తెరాస శ్రేణులే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నారు. అందులో రహస్యం ఏమీ లేదు.
నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే అప్పట్లో సుమారు ఆరేడు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసేఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే పరిపాలన సాగించారు.
ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నా లే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాల్లో అప్పటి నుంచీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభో త్సవానికి డుమ్మా కొట్టారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.