దాడి రాకతో కొణతాలకు అనారోగ్యం మొదలు
posted on May 17, 2013 @ 2:45PM
జగన్ మోహన్ రెడ్డి ఎలాగో కష్టపడి కొండెక్కి కూర్చొన్న సురేఖ దంపతులని చంచల్ గూడా జైలులోకి దింపగలిగారు. కానీ, దాడి వీరభద్రరావును చేర్చుకోవడంతో కణకణమండుతున్న రామకృష్ణుడి కోపం మాత్రం ఇంకా చల్లార్చలేకపోతున్నారు. ఆయన జైలుకి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో, ఈ సమస్యకి పరిష్కారం దొరకడంలేదు.
రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడయిన కొణతాల క్రిందటి వారం హైదరాబాదులో జరిగిన కమిటీ సమావేశానికి మొహం చాటేశారు. ఇక, మొన్న షర్మిలమ్మ 2000కిమీ పాదయాత్ర పూర్తిచేసుకొన్నపుడు పార్టీలో చిన్నా పెద్దా నాయకులందరూ తరలివెళ్లి ఆమెకు అభినందనలు తెలిపినా, కొణతాల ఆయన అనుచరులు మాత్రం వెళ్ళలేదు. మళ్ళీ నిన్న జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి కూడా ఆయన మొహం చాటేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఎవరు వచ్చినా రాకున్నా మీడియా పెద్దగా పట్టించుకోదు. కానీ, కొణతాల హాజరు కాకపోతే మాత్రం మీడియాకు జవాబు చెప్పుకోవడానికి వైకాపా నేతల చాలా ఇబ్బందిపడవలసి వస్తోంది. ఆయన అనారోగ్యం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు తమకి ముందే తెలియబరిచారని వైకాపా నేతలు చెప్పుకొన్నారు. ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఆయనకీ మచివి కావు అటు పార్టీకి మంచివి కావు కనుక ఆయన ఆరోగ్యంపై 'దాడి' చేస్తున్నవీరభద్రుడి విషయంలో పార్టీ తగిన నిర్ణయం తీసుకోకపోతే ఇక ఆయన శాశ్వితంగా అనారోగ్య కారణాలతోనే పార్టీకి దూరం కావచ్చునేమో!