నిరాహారదీక్షకు దిగిన కోడి కత్తి శీను తల్లి, సోదరుడు
posted on Jan 18, 2024 @ 3:15PM
గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన విశాఖ జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహారదీక్షకు దిగారు. దీక్షకు పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ... తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. తమకు ప్రజా సంఘాలు మద్దతును ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు కూర్చోనున్నాడని సమాచారం.
కోడికత్తి కేసు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అంటే 2018లో జరిగింది. తన పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలు దేరే ముందు విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఈ దాడి జరిగింది. ఇది జగన్ పై జరిగిన దాడి కాదు అప్పటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీను జైల్లోనే నిరాహారదీక్ష చేస్తానని నిరుడు హెచ్చరించాడు. కానీ ఇప్పటికీ నిజానిజాలు తేలలేదు. నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.. అయినా సరే ఎన్‌ఐఏ లాంటి సంస్థ ఈ కేసును తేల్చకపోవడం చర్చనీయాంశమైంది.మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చినా ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దు అయి తిరిగి శ్రీనివాస్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇలా తన కుమారుడు రిమాండ్ ఖైదీగానే ఉండిపోవడంపై శ్రీనివాస్ తల్లి సావిత్ర గత ఐదేళ్లుగా ఆవేదన చెందుతున్నారు. తన కుమారుడిని బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన కుమారుడిని విడుదల చేయకపోతే ఈ వయసులో తమకు ఆత్మహత్య తప్ప మరోదారి లేదని ఆమె హెచ్చరించారు. ఎన్‌ఐఏ సంస్థ దర్యాప్తు చేపట్టినప్పటికీ ఈ కేసు ఎటూ తేలకపోవడం మిస్టరీగా ఉంది.