కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ ల ఉద్యోగాలు హుళక్కి
posted on Mar 23, 2013 @ 9:34AM
ఈ నెల 22న సడక్ బంద్ టి.ఆర్.ఎస్., టి.జెఎసి, పలు పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. సడక్ బంద్ సందర్భంగా టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, టి.జెఎసి చర్మాన్ కోదండరాం, తెలంగాణా ఉద్యోగ సంఘాల కో-చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కోర్టు లో వీరు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా మేజిస్ట్రేట్ శుభావాణి బెయిల్ పిటీషన్ పై నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఆలంపూర్ కోర్టు వారికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోదండరాం ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చే పేజీ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా ఉన్నారు. 2009 డిసెంబర్ 24 నుండి టి.జెఎసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి విడతల వారీగా శెలవులో ఉంటూ వచ్చారు. అలాగే జిహెచ్.ఎం.సి. పరిథిలోని రాజేంద్రనగర్ డిప్యుటీ కమీషనర్ గా పనిచేస్త్తున్న శ్రీనివాస్ గౌడ్ తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, జెఎసి అధికార ప్రతినిధిగా ఉండేవారు. ఇటీవలే టి.జెఎసి కో-చైర్మన్ గా నియమితులయ్యారు. వీరిద్దరూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం సర్వీసులో కొనసాగుతూ 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే వారిని అనివార్యంగా సస్పెండ్ అవుతారు. ఈ రోజు సాయంత్రంలోగా బెయిల్ రాకపోతే వీరిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారు.