ఇక ప్రచార యాత్రలు: కోదండరామ్
posted on Apr 5, 2011 @ 11:53AM
హైదరాబాద్ : ఈనెల 11వ తేదీ నుంచి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంపై ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 20వ తేదీ నుంచి వరుస ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈసారి ఉద్యమం కేంద్రంపైన, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఉంటుందని చెప్పారు. 5 రాష్ట్రాల ఎనికల దృష్ట్యా తాము వెనక్కి తగ్గలేదని, ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ వ్యూహమన్నారు. ఈరోజు జిల్లా ఐకాస నేతలతో కోదండరామ్ సమావేశం కానున్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ, ప్రచార యాత్రల నిర్వహణ, ఉద్యమ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడంపై చర్చ జరుగుతోంది. జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగా చూస్తున్నామని కోదండరామ్ చెప్పారు. వైయస్ జగన్‌కు సహకరించడమంటే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని ఆయన అన్నారు. జగన్ వెంట తిరగడమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా వ్యవహరించడమేనని ఆయన అన్నారు.