మరణించాకా ప్రజల గుండెల్లో
posted on Apr 5, 2011 @ 11:58AM
హైదరాబాద్: మరణించిన తర్వాత ఎంతోమంది నాయకులను ప్రజలు మర్చిపోతారని కానీ బాబూ జగ్జీవన్ రామ్‌ను మాత్రం తమ గుండెల్లో ప్రజలు నిలుపుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. షెడ్యూల్డు కులాలకు ఎనలేని కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎస్సీలకు ఇప్పటికీ భూములు లేవని వారికి కొన్ని హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఫైనాన్సు కార్పోరేషన్‌లో డబ్బులు లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీలను, ఎస్టీలను విస్మరిస్తోందన్నారు. వారి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. టిడిపి ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కమిటీ కోసం చైర్మన్‌ను కూడా నియమించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.