సచివాలయం తాకట్టు కట్టు కథ.. సీఆర్డీయే.. ఔను తాకట్టు పెట్టేశాం తప్పేమిటి?.. కొడాలి నాని
posted on Mar 4, 2024 @ 2:39PM
తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అనే పుస్తకం రాశారు. ఇండియా మార్టిగేజ్ డ్ అని ఆయన ఆంగ్లంలో రాసిన పుస్తకం, తాకట్టులో భారత దేశం పేరిట తెలుగులో అనువాదమైంద. ఆర్థిక నిపుణులు సైతం ఆయన ఆ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలన్నీ అక్షర సత్యాలని అంగీకరిస్తారు. అయితే ఆయన పుస్తకంలో ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల పేరిట, అభివృద్ధి పేరిట దేశంలోని కంపెనీలను ఎలా బంధిత పరిశ్రమలుగా మార్చేస్తున్నాయో, మార్చేశాయే కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. ఆయన చెప్పిన దేశం ఎలా తాకట్టులో ఉందో అర్ధమౌతుంది.
ఆ తాకట్టు సాంకేతిక పరమైనది. ఉదాహరణకు ఒక అల్యూమినియం కంపెనీ, అదీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటై, ఆ సంస్థ ఏర్పాటుకు అవసరమైన యంత్ర సామగ్రి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మొత్తం అప్పుగా తీసుకుంటుంది. అదీ అంతర్జాతీయ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు) నుంచి, అందుకు ప్రతిగా, ఏటా కిస్తీ చెల్లించడంతో పాటు, ఆ కంపెనీ ఉత్పత్తి చేసే మొత్తం అల్యూమినియంను వరల్డ్ బ్యాంక్ చెప్పిన ధరకు, చెప్పిన దేశానికి అమ్మాల్సి ఉంటుంది. ఇదే తాకట్టు అని ఆయన అన్నారు. ఆ పరిశ్రమను క్యాప్టివ్ ఇండస్ట్రీ (బంధిత పరిశ్రమ)గా అభివర్ణించారు. అంటే అప్పు పేరుతో కంపెనీ మనుగడ, అస్థిత్వం ఇలా అన్నీ ప్రపంచబ్యాంకు గుప్పెట్లో ఉంటాయి. కానీ వర్చువల్ గా మార్టిగేజ్, తాకట్టు అన్న పదం మాత్రం ఈ పరిస్థితికి సరిపోదు.
కానీ జగన్ సర్కార్ మాత్రం వర్చువల్ గా ప్రభుత్వ ఆస్తులను, భవనాలను, ప్రజలు మద్యం తాగడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి పబ్బం గడుపుకుంటున్నారు. అదెంత వరకూ వచ్చిందంటూ ఏకంగా ఆయన తన ప్రభుత్వాన్నే ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టేశారు. ఆ మేరకు ఆ బ్యాంకుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడమేమిటంటారా? ప్రభుత్వ పాలన జరిగే సచివాలయాన్నే ఆయన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు తాకట్టు పెట్టారు. ఈ మేరకు రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకుని మరీ రూ. కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ విషయం మీడియాలో వచ్చిన వెంటనే.. అదంతా అవాస్తవ ప్రచారం అంటూ సీఆర్ డీఏ రంగంలోకి దిగిపోయింది. అటువంటి సమాచారం ఏదీ సీఆర్డీఏ పేర్కొంది. సచివాలయం తాకట్టు వార్త ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి ఉద్దేశించి కల్పిత కథనం అనీ, ఈ ప్రచారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఓ ప్రకటన జారీ చేసింది.
అయితే అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి అంటూ మీడియా ఎదుటకు వచ్చేశారు. తాకట్టు పెట్టకుండా డబ్బులెక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించేశారు. అయినా సచివాలయం అంటూ ప్రజాస్వామ్య దేవాలయం ఏమీ కాదు కేవలం పది ఎకరాల ఆస్తి మాత్రమే అంటూ తన పరిజ్ణానాన్నంతా ఒలకబోశారు. అవసరానికి ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం సాధారణ విషయమేనని జగన్ సర్కార్ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వమే ఎలాంటి దాపరికం లేకుండా తాకట్టు విషయం చెప్పేస్తుంటే సీఆర్డీయే మాత్రం ఎందుకు అదంతా అవాస్తవ ప్రచారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టేసిన సీఎంగా జగన్ అనితర సాధ్యమైన రికార్డు సృష్టించేశారు.