పివి ని కిరణ్ ఎలా స్మరించుకొన్నారంటే....

 

 

 

దివంగత ప్రధాన మంత్రి పి.వి.నరసింహా రావుకు తన తండ్రి అమర్ నాధ్ రెడ్డి నమ్మిన బంటుగా ఉండేవారని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కిరణ్ తన కుటుంబానికి పి.వి. తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

 

తన వివాహానికి హాజరు కావడం కోసం ఆ సమయంలో రష్యాలో ఉన్న పి.వి. ఎంతో శ్రమకోర్చి నాలుగు విమానాలు మారి వచ్చి హాజరయ్యారని కిరణ్ గుర్తు చేసుకున్నారు.



‘1987 లో రాష్త్రపతి ఎన్నికల సమయంలో ఓ దశలో ఆ పదవికి పి.వి. పేరు పరిశీలనలోకి వచ్చింది. దీనితో, ఆయన తన తండ్రికి చేసి, తన స్వగ్రామానికి వెళ్లి ఓటర్ల జాబితా తీసుకురమ్మని చెప్పారు. ఈ విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు’, అని కిరణ్ అన్నారు.



అంతే కాదు, తన తండ్రి మరణించినప్పుడు పి.వి. స్వయంగా పాడె మోశారని ముఖ్య మంత్రి గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న వారికి ఆయన ఏ స్థాయిలో అయినా సహాయపడేవారని కిరణ్ అన్నారు.



పి.వి. తనను ముందుగా పార్లమెంట్ కు పోటీ చేయమని సలహా ఇచ్చారని, అయితే,తాను అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తానని పట్టుబట్టానని ముఖ్య మంత్రి దివంగత ప్రధానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.