ప్రజలారా! మా వైఫల్యాలకు మా అభినందనలు అందుకోండి

 

నిన్న అత్యవసరంగా సమావేశమయిన మన మంత్రి వర్గం చేసిన ఘన కార్యం ఏమిటంటే ప్రభుత్వ చర్యలను సమర్దిస్తూ తీర్మానాలు చేయడం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా సంఘటనా స్థలంకి వెళ్లడాన్నిఅభినందిస్తూ ఒక తీర్మానం, కేంద్రం అందించిన తోడ్పాటుకు అభినందిస్తూ మరో తీర్మానం, భాదితులకు ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటించడాన్నిసమర్దిస్తూ మరో తీర్మానం మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని మంత్రి అరుణకుమారి మీడియాకు చెప్పడం సిగ్గుచేటు.

 

ఇటువంటి ఆపత్కాలంలో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా ఏమి చర్యలు చెప్పటాలో ఆలోచించేబదులు, తమని తాము అభినందించుకొంటూ తీర్మానాలు చేసుకోవడం, మళ్ళీ ఆ విషయాన్ని చెప్పడానికి మీడియా ముందుకు రావడం సిగ్గుపడాల్సిన విషయం. ఒకవైపు తమ వైఫల్యాలు ప్రస్పుటంగా కనబడుతుండగా, తమ వైఫల్యాలకి సిగ్గుపడుతూ, ప్రజలను క్షమాపణలు కోరకపోగా, ఒకరికొకరు ఈ విధంగా అభినందనలు తెలుపుకోవడం భాదితులతో చేస్తున్నవికృత పరిహాసమే అవుతుంది.

 

ఇది మన ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతూ, ఈ దుర్ఘటన వల్ల వారి ఆలోచనలో వీసమంత మార్పుకూడా రాలేదని తెలియజేస్తోంది.ప్రజలు మనల్ని ప్రశ్నించ(లే)రు గనుక మనం మన వైఫల్యాలకు జవాబుదారిగా ఉండవలసిన అవసరం లేదని కిరణ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. కానీ, రేపు ఆ ప్రజలలోనే ఎవరయినా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేసినట్లయితే, అప్పుడు కిరణ్ ప్రభుత్వ పరిస్థితి ఏమిటనేది వారే ఆలోచించుకోవాలి. ఒకవేళ అదే జరిగితే అప్పుడు కూడా తాము ఇంతే దైర్యంగా ఈ అభినందనల తీర్మానాలను కోర్టుకు సమర్పిస్తే ఏమవుతుందో ఊహించుకొంటె మళ్ళీ ఇటువంటి పొరపాటులు చేయ సాహసించక పోవచ్చును.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి, మరికొందరు కేంద్రమంత్రులు సంఘటనా స్థలానికి వెళ్లిరావడమే ఒక అబ్బురమయిన విషయంగా పేర్కొంటున్న మన కిరణ్ ప్రభుత్వం ఇటువంటి సంఘటనలే అమెరికాలో జరిగినప్పుడు, స్థానిక రాష్ట్ర మంత్రులకన్నా ముందుగా అక్కడికి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా వెళ్లి ఏవిధంగా బాధితులకు సానుభూతి చెప్పారో, ఏవిధంగా సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షిన్చారో చూసి ఉంటే, ఈరోజు తమ పనితీరుకు, మాటలకి, ఈ అబినందలకి తప్పకుండా సిగ్గుపడేవారు.

 

నిఘా వర్గాలు హెచ్చరికలు లేనప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు తమ బాధ్యతల నుండి తప్పించుకోలేవు. అటువంటప్పుడు దాడులు జరగబోతున్నాయని పక్కా సమాచారం చేతిలో ఉంచుకొని కూడా స్పందించక అనేకమంది అమాయక ప్రజల ప్రాణాలను కోల్పోవడానికి కారణమయిన ప్రభుత్వం తనని తాను తిట్టుకొని సిగ్గుపడకపోగా ఈవిధంగా అభినందించుకొంటూ, మళ్ళీ ఆ విషయాన్నీ మీడియాకు ఎక్కి మరీ చాటింపు వేసుకోవడం పుండు మీద కారం చల్లినట్లు ఉంది.

 

ప్రతిపక్షాలను ఈ అంశంపై రాజకీయాలు చేయవద్దని సుద్దులు చెపుతున్న ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? ఈ అభినందన ప్రకటనలు చూస్తుంటే, తమ నిర్లక్ష్యం ఖరీదు 13 నిండు ప్రాణాలని ప్రభుత్వానికి ఇంకా అర్ధం కాలేదనుకోవాలా? లేకపొతే, నిర్లక్ష్యం, నిఘా వైఫల్యాలు, నిర్లిప్తత కలబోసిన తమ ప్రభుత్వాన్నిఇటువంటి భూటకపు ప్రకటనలతో ప్రజల నుండి ఏమార్చే ప్రయత్నంలో ఈ అభినందన తీర్మానాలు చేసుకొన్నారని భావించాలా?

 

ఇప్పటికయినా కిరణ్ ప్రభుత్వం తమ కిరీటం, తమకు తాము తగిలించుకొన్న భుజకీర్తులు తీసి కొంచెం పక్కన పెట్టి, సాటి మానవులుగా ఆలోచించి దిద్దుబాటు చర్యలు చెప్పట్టడం మంచిది. అభినందన సమావేశాలకు బదులు, లోపాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని సవరించుకోవడానికి తాము ఏమి చేయాలో వంటి విషయాలను చర్చించగలిగితే ప్రజలను ఉద్దరించినవారవుతారు.