Read more!

ఆటల తోటలో విరబూసే క్రీడాకారులు!

ఓ పది సంవత్సరాల క్రితం చిన్న పిల్లల లైఫ్ స్టైల్ గురించి గుర్తుచేసుకుంటే ఉదయాన్నే లేవడం తయారవ్వడం తరువాత స్కూల్ వెళ్లడం, ఆ తరువాత సాయంత్రం ట్యూషన్ కి వెళ్లడం, లేదా ఇంట్లో అమ్మ దగ్గరో, నాన్న దగ్గరో కూర్చుని హోమ్ వర్క్ చేయడం, అది అయిపోయాక తూనీగలా ఎగురుతూ వీధుల్లో పిల్లలతో కలసి చీకటి పడేవరకు ఆటలు ఆడుకోవడం ఉండేది. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఉదయం లేచి చదవడం,తరువాత ట్యూషన్, తరువాత స్కూల్, ఆ తరువాత ట్యూషన్, ఆ తరువాత మళ్ళీ ఇంట్లో స్కూల్, ట్యూషన్ లో చెప్పేవన్నీ తిరగేస్తూ చదువుతూనే అలసిపోతూ నిద్రపోతున్నారు పిల్లలు. ఈకాలం పిల్లలకు మానసికంగా అలసిపోవడమనే సమస్య ఎదురవుతోంది కానీ శారీరక శ్రమ అంటూ ఉండదు. అందుకే కొందరు పిల్లలు ఎప్పుడూ నీరసంగా, బద్ధకంగా కనిపిస్తూ ఉంటారు. 

ఆటలు పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో గొప్పగా సహాయపడతాయి. పిల్లలకు రోజులో కొంత సమయం ఆటలలో గడిపేలా చేస్తే వారిలో చాలా గొప్ప వ్యక్తిత్వం అలవడుతుంది. అదెలా అనే సందేహం అందరికీ రావచ్చు. ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న నేషనల్ స్పోర్ట్స్ డే ని జరుపుకుంటారు. స్పోర్ట్స్ డే సందర్భంగా చిచ్చరపిడుగుల్లా పిల్లలను మార్చి వారి జీవితాన్ని మాత్రమే కాకుండా ఈ దేశాన్ని కూడా ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లే ఆలోచన ప్రతి తల్లిదండ్రులు చెయ్యాలి. మరి పిల్లల జీవితంలో ఆటలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాల్సిందే!!

శారీరక, మానసిక ఆరోగ్యం!!

ఎప్పుడూ పుస్తకాల ముందే ఉంటే పిల్లలకు మెదడు మీద పని ఎక్కువ పడుతుంది. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలకు చదువు ముఖ్యమే కానీ వారు చిన్నతనంలోనే రికార్డులు సృష్టించేయాలనే  ఆలోచనతో వారిని ఒత్తిడిలోకి నెట్టకూడదు. 

చదువు అయినా, ఆటలు అయినా పిల్లలు ఇష్టంతో చేసినప్పుడే వాటిలో నైపుణ్యం పెరుగుతుంది. 

చదువు మీద క్రమంగా ఇష్టం పెరిగేలా చెయ్యాలి, అలాగే చదువు ఒత్తిడి దూరం కావడానికి ఆటలు మంచి రిలీఫ్ గా పనిచేస్తాయి. చదువు గురించి ఎలాగైతే ఎక్కువ ఒత్తిడి పెంచకూడదో అలాగే ఆటల మీద కూడా ఎక్కువ సమయం వదిలేయకూడదు. రోజులో దానికి కొంతసేపు అని ఓ సమయాన్ని ఫిక్స్ చెయ్యాలి.

అలా చేస్తే శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆక్టివ్ గా ఉంటారు.

 మానసిక పరిణితి!!

ఆటల ద్వారా పిల్లలలో స్పోర్టివ్ నెస్ అనేది పెరుగుతుంది. పట్టుదల, ఓర్పు పెరుగుతాయి. దానివల్ల ఏదైనా సాధించాలంటే కష్టపడతారు.

చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని మధ్యలోనే భయపడి, నిరాశకు లోనయ్యి వెనకడుగు వేసే నైజం తగ్గుతుంది. 

గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే గుణం పెరుగుతుంది.

క్రీడా రంగంతో మంచి భవిష్యత్తు!!

క్రీడలలో రాణించేవారికి కేంద్రప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల నియమాకాల్లో స్పోర్ట్స్ కేటగిరిని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పిస్తుంది. ఫలితంగా క్రీడలలో మునిగి తేలుతూ జీవితానికి ఎలాంటి ఉద్యోగ భరోసా ఉండదు అనుకునేవారికి నిశ్చింత ఉంటుంది.

పథకాలు కొల్లగొడితే ప్రభుత్వాల నజరానాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ కొలువులు కూడా ఇస్తారు. ఉండటానికి నివాస స్థలాలు కేటాయిస్తారు.

సాధారణంగా జరిగే ఉద్యోగ నియమకాల్లో స్పోర్ట్స్ పర్సన్స్ కు ప్రాధాన్యత ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కొలువులు, రైల్వే కొలువులు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడం చాలా చోట్ల గమనించే ఉంటారు.

విభిన్న ప్రాంతాలు, ఇతర దేశాలు చూసే అవకాశం క్రీడాకారులకు ఓ అవకాశం. 

అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రం కోసం, దేశం కోసం పథకాలు సాధించాము అనే కీర్తి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.

అయితే సాధారణ ఆటల నుండి జాతీయ స్థాయికి ఎదగడం వెనుక కృషి పట్టుదల ఉండాలి. నేడు భారతాన్ని పథకాలతోనూ, కప్పులతోనూ, విజయాలతోనూ గర్వపడేలా చేస్తున్న క్రీడాకారులే అందరికీ స్ఫూర్తి అనే విషయాన్ని అందరూ గమనించాలి. పిల్లలను ఆటల తోటలో తూనీగల్లా కొద్దిసేపు అయినా ఉండనివ్వాలి. ఎందుకంటే అక్కడే క్రీడాకారుల తొలి అడుగులు పడేది.

                                       ◆నిశ్శబ్ద.