Read more!

కిడ్నీ ఫెయిల్యూర్ ను కనిపెట్టచ్చు ఇలా….

ఈమధ్య కాలంలో చాలామంది విషయంలో తరచుగా వినబడుతున్న మాట కిడ్నీ ఫెయిల్యూర్. శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం అయిన కిడ్నీలు దెబ్బతినడం అంటే ఆరోగ్యానికి చాల పెద్ద ముప్పు వచ్చినట్టే. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి?? అది ఎలా వస్తుంది?? దాన్ని ఎలా నిర్ధారిస్తారు వంటి విషయాలు తెలుసుకుంటే…

కిడ్నీ ఫెయిల్యూర్ అంటే….

మూత్రపిండాలలోని నెఫ్రాన్లు వడపోత పోయగలిగే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు దానిని మూత్ర పిండాలు వైఫల్యం చెందడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు.  ఈ సమస్య హఠాత్తుగానూ జరగవచ్చు లేదా ఏళ్ళ తరబడి లక్షణాలేమీ కనిపించక పోయినా... చివరికి ఎప్పుడో బైటపడవచ్చు.

హఠాత్తుగా కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దానికి మూత్రపిండాలపైన బలమైన దెబ్బలు తగలడం కాని, విపరీతమైన రక్తస్రావం కావడం కానీ, విషపదార్ధాలను తీసుకోవడం కానీ కారణం అయి ఉంటుంది. అలాగే చాలా రకాల మందులకు మూత్రపిండాల మీద దుష్ప్రభావాన్ని చూపించే గుణం ఉంది. మూత్రపిండాలకు మందుల నుండి ప్రమాదం అంటూ ఉంటే అది 'ఓవర్ ది కౌంటర్' మందుల నుంచే ఉంటుంది. ఈ మందుల్లో చాలా వరకూ జ్వరాన్ని, నొప్పిని తగ్గించేవే ఉంటాయి. యాసిన్, ఎసిటెమైనోఫిన్, బబుబ్రూఫెన్ మొదలైన మందులన్నీ మూత్రపిండాల పై దుష్ప్రభావాన్ని చూపించేవే. మూత్రపిండాల వ్యాధితో బాధపడే వాళ్లు కానీ, అవి వచ్చే అవకాశాలు ఉన్నవాళ్లు గానీ ఈ మందులను ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు.

ఎంతోకాలం నుంచి మూత్రపిండాల వైఫల్యం కొనసాగుతున్నట్లైతే దానికి హై బీపీ కాని, షుగర్ కాని కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహంలో గ్లూకోజ్ కణజాలాలకు అందకుండా రక్తంలోనే ఉండిపోయి మూత్ర పిండాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. హై బీపీలో మూత్రపిండాలలో ఉండే కేశ సాదృశ్యమైన రక్తనాళాలు నష్ట పోయి వడపోత దెబ్బతింటుంది.

కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు:

 మూత్రపిండాల వ్యాధుల్లో, ముఖ్యంగా మూత్రపిండాల వైఫ్యలం మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం తర్వాత అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. నలతగా అనిపిస్తుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దురదగా ఉంటుంది. మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. కానీ, మూత్రం తక్కువగా వస్తుంది. ఆకలి ఉండదు. కడుపులో తిప్పుతున్నట్లుగా, వికారంగా అన్పిస్తుంటుంది. కాళ్ళు, చేతులు వాపులు వస్తాయి. ముఖం ఉబ్బుతుంది. శరీరమంతా మొద్దుబారినట్టు, తిమ్మిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి నిర్ధారణ : 

రక్తంలో క్రియాటినిన్, యూరియా నైట్రోజెన్ అధిక మోతాదులో ఉన్నా,  మూత్రంలో ప్రొటీన్  ఎక్కువగా పోతున్నా, మూత్రపిండాల వ్యాధి బారిన పడినట్లు గ్రహించాలి. క్రియాటినిన్ అనేది కండరాల విధి నిర్వహణలో వెలువడే వ్యర్థ పదార్థం. అలాగే యూరియా నైట్రోజెన్ అనేది శరీరంలో ప్రొటీన్ వినియోగం తర్వాత రక్తంలోకి విడుదలయ్యే వ్యర్థ పదార్థం. ఈ రెండు పదార్థాలను మూత్రపిండాలు వడపోయ లేకపోవడంతో అవి రక్తంలోనే పేరుకుపోతాయి.

అందుబాటులో ఉన్న నిర్దారణ మార్గాలు:- 

అల్ట్రాసౌండ్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ వంటి పరీక్షలను చేయడం వల్ల మూత్రపిండాలలో వ్యాధి పెరుగుదలను కనిపెట్టే అవకాశం ఉంది. 

కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

మధుమేహం కానీ, హైబీపీ వంటివి ఉంటే వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ప్రోటీన్ వాడకాన్ని తగ్గిస్తే మూత్రపిండాల పై ఒత్తిడి తగ్గు తుంది.. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించాలి, ఆహారంలో ఉప్పు వాడకం కూడా తగ్గిస్తే చాలా మంచిది.

                                   ◆నిశ్శబ్ద.