ఈ 5 లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని అర్థం..!
posted on Nov 14, 2025 @ 9:30AM
మూత్రపిండాలు మానవ శరీరంలో ఒక భాగం. ఇవి 24 గంటలు నిశ్శబ్దంగా తమ విధులు నిర్వర్తిస్తాయి. మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని, అదనపు నీటిని తొలగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోరు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రమైన అనారోగ్యంగా డవలప్ అవుతాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని, వీటి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే..
లక్షణాలు..
కిడ్నీ సమస్యలు తరచుగా చాలా చిన్న లక్షణాలతో మొదలవుతాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద సమస్యగా మారతాయి.
అలసట,బలహీనత..
ఎప్పుడూ అలసట, కాళ్ళలో లేదా కళ్ళ కింద వాపు, మూత్రం రంగు లేదా పరిమాణంలో మార్పులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మం పొడిబారడం, చర్మం దురదగా ఉండటం మొదలైనవన్నీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయనడానికి సంకేతాలు.
ఎప్పుడూ అలసట లేదా బలహీనత అనేవి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతున్నాయని, మూత్రపిండాలు వాటిని సరిగ్గా తొలగించలేకపోతున్నాయని అర్థం. బాగా నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపించడాన్ని , అస్సలు తేలికగా తీసుకోకూడదు. శరీరంలో వాపు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. ఇది మొదట పాదాలు, చేతులు లేదా ముఖంలో కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు.
మూత్రంలో మార్పులు..
మూత్రపిండాల సమస్యలకు చాలా స్పష్టమైన సంకేతం. ముదురు రంగు మూత్రం, మూత్రంలో నురుగు లేదా బుడగలు, తరచుగా మూత్రవిసర్జన లేదా మంట వంటివి మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వైఫల్యాలు ఎదుర్కునే చాలామందిలో ఉండే లక్షణం. మూత్రపిండాలు శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గుండె లేదా ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం మూత్రపిండాల సమస్య.
పొడి, దురద చర్మం..
మూత్రపిండాలు రక్తం నుండి అవసరమైన ఖనిజాలు, వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల పొడి చర్మం, దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, దురదగా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి సమస్యలు ముదిరే కొద్ది ఈ సమస్య బయటకు కనిపిస్తుంది.
పై లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును కూడా గణనీయంగా కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికం వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయడం లేదా, మూత్ర పిండాలను సంరక్షించడం చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి, మూత్రపిండాల ఒత్తిడిని తగ్గిస్తాయి.
చేపలు, కాయధాన్యాలు లేదా గుడ్డులోని తెల్లసొన వంటి లీన్ ప్రోటీన్ లను తీసుకోవాలి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి. వీటిలోని ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలు ఎక్కువగా పని చేయడానికి కారణం అవుతాయి. ప్రతి చిన్న సమస్యకు అధికంగా మందులు వాడటం, ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుల సలహా లేకుండా పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...