ఉత్తరాంధ్ర, ఢిల్లీ ఇక సుబ్బారెడ్డిదే! విజయసాయి సర్ధేసుకున్నట్లేనా?!
posted on Aug 7, 2023 6:59AM
టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే లోకేష్ పేరు సహజంగానే వినిపిస్తుంది. అదే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరిది అంటే ఠక్కున ఒక పేరు చెప్పడం ఇప్పుడు కష్టమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, పాదయాత్ర సమయంలోనూ, జైలుకెళ్లినప్పుడూ జగన్ వెంట ఉన్న తల్లీ, సోదరి ఇప్పుడు దూరమయ్యారు.ఇక జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకూ బయటకి వచ్చింది లేదు. ఇక కుటుంబం కాకుండా పార్టీలో జగన్ తర్వాత ప్రాముఖ్యత గల నేతలు ఎవరంటే మొన్నటి వరకూ విజయసాయి రెడ్డి పేరు గట్టిగా వినిపించేంది. ఆ మాటకొస్తే జగన్ పార్టీ స్థాపించక ముందు నుంచే విజయసాయి రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించారు. జగన్ కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి కూడా కొన్ని నెలలు జైలులో గడిపారు.
ఆ కేసులలో ఏ 1 జగన్ రెడ్డి అయితే ఏ 2 విజయసాయిరెడ్డే. అందుకే జగన్ దగ్గరికి వెళ్లలేనివారు విజయసాయిరెడ్డి వద్ద తమ సమస్యలు చెప్పుకునేవారని వైసీపీ వర్గాలే చెబుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ ఎలాగో జగన్ కు విజయసాయి అలాగ అని గతంలో గట్టిగా వినిపించేది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో విజయసాయి రెడ్డి కీలక భూమిక పోషించారనే సంగతి తలిసిందే. ఐ ప్యాక్‌తో కోఆర్డినేషన్ విషయంలో కూడా అప్పట్లో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని చెబుతారు. ఈ క్రమంలోనే ఇటు జగన్ తో వ్యాపార సంబంధాలతో పాటు జాతీయ స్థాయిలో వైసీపీకి సంబంధించిన అన్ని అంశాలను విజయసాయి రెడ్డి దిగ్విజయంగా చూసుకొనే వారు. విజయసాయి రెడ్డి ఢిల్లీ వ్యవహారాలలో పర్ఫెమెన్స్ చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం తెర మీదకి తెచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించారు.
అయితే అదంతా గతం. ఇప్పుడు జగన్ - విజయసాయి మధ్య సఖ్యత లేదనే ప్రచారం గట్టిగా జరుగుతున్నది. ఢిల్లీ వ్యవహారాలలో ఈ ఇద్దరి మధ్య ఎక్కడో తేడాలు వచ్చాయని, అందుకే విజయసాయిని జగన్ దూరంగా పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన జగన్.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో.. వైవీ సుబ్బారెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించారు. ఆ సమయంలో కనీసం ఓటింగ్‍కు కూడా విజయసాయి హాజరు కాలేదు. ఇక గడప గడపకూ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన వర్క్ షాపులో కూడా జగన్.. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ చార్జి, అనుబంధ విభాగాల సమన్వయకర్త ఇలా అన్ని బాధ్యతలు పోయి.. ఒక్క రాజ్యసభ మాత్రమే విజయగాయి మిగిలారు. కాగా, ఇప్పుడు అధికారికంగానే ఢిల్లీ వ్యవహారాలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం.
గతంలో విజయసాయి చూసిన ఢిల్లీ వ్యవహారాలన్నీ ఇకపై అధికారికంగా సుబ్బారెడ్డి చూడనున్నారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న సుబ్బారెడ్డికి మరికొన్ని అనుబంధ విభాగాలను కూడా అప్పగించనున్నారని చెబుతున్నారు. తిరుమల తిరుపతి చైర్మన్ పదవి గడువు ముగుస్తుండటంతో ఇకపై జగన్ తన బాబాయ్ సుబ్బారెడ్డిని పూర్తిగా రాజకీయ కార్యకలాపాలలోకి దించే యోచనలో ఉన్నారనీ, అందుకు తగ్గట్లే ఇటు ఉత్తరాంధ్ర, అటు ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టే పనిని అప్పగించనున్నారనీ చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఇక విజయసాయి శకం ముగిసినట్లే భావించాల్సి వస్తుంది. పార్టీలో నంబర్ 2 అనే స్థాయిలో చక్రం తిప్పిన విజయసాయి ఇప్పుడు కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాగా.. రేపు ఆ పదవీ కాలం పూర్తయ్యాక అది కూడా కొనసాగిస్తారా లేక సాయన్నముసలోడైపోయారని పక్కన పెడతారో చేడాలి.