ముస్లిం యువకుని కోసం… శివాలయంలో పూజలు బంద్!
posted on Feb 5, 2016 @ 2:43PM
కేరళలో జరిగిన ఒక అరుదైన సంఘటనలో మానవత్వానికి మతాలు అడ్డురావని తేలిపోయింది. అక్కడి తిరువనంతంపురంలోని ఒక చిన్న ఊరు అత్తింగల్. అందులోని శివాలయ ఉత్సవ కమిటీలో షబ్బీర్ అనే కుర్రవాడు కూడా చురుకుగా పాలుపంచుకునేవాడు. షబ్బీర్‌ను గత ఆదివారం కొందరు కొట్టి చంపేశారు. అందుకు సంతాపంగా అత్తింగల్ శివాలయంలో రెండురోజుల పాటు ఎలాంటి పూజాదికాదికాలూ నిర్వహించలేదు. షబ్బీర్‌ను తమ మిత్రునిగానే భావించాం కానీ వేరే మతం వాడిగా ఎప్పుడూ చూడలేదని… షబ్బీర్ ఇటు శివాలయానికీ అటు మసీదుకీ కూడా నిరభ్యంతరంగా వెళ్తూ ఉండేవాడని ఆలయ కమిటీ మెంబర్లు చెప్పారు. షబ్బీర్ మృతికి సంతాపంగా ఈ నెల 9వ తేదీన తలపెట్టిన ఊరేగింపుని కూడా రద్దు చేసింది ఆలయ కమిటీ.