యూ టర్నా.. కమలాన్ని ఇరికిస్తున్నారా? సీఎం కేసీఆర్ దారెటు?
posted on Jan 2, 2021 @ 10:51AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మారిపోయారా? వరుస ఓటములతో ఆయన దిగొచ్చారా? తెలంగాణలో ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాల్లోనే కాదు టీఆర్ఎస్ లోనూ ఇదే ఇప్పుడు ప్రధానంగా మారిందని చెబుతున్నారు. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే. మాములుగా తనకు నచ్చిన పని చేసేస్తుంటారు గులాబీ బాస్. అది అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా సరే ఆయన తన నిర్ణయాలను వెనక్కి తీసుకోరు. మొండిగా ముందుకు వెళుతూనే ఉంటారు. కాని ఇటీవల మాత్రం ఆయన మైండ్ సైట్ లో మార్పు కనిపిస్తోంది. తాను తీసుకున్న కొన్ని విధాన పరమైన నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్నారు కేసీఆర్. గతానికి భిన్నంగా తన నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాల్లో ఆస్తక్తిగా మారింది. కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారారని విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. రాజకీయ అనలిస్టుల నుంచి మాత్రం కేసీఆర్ యూ టర్న్ ల వెనక బలమైన వ్యూహమే ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా వెళుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలానికి బూస్ట్ ఇచ్చాయి. వరుస విజయాల జోష్ తో రాష్ట్రంలో అధికారమే లక్ష్యమంటోంది కాషాయ దళం. దీంతో తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీకి బ్రేక్ వేయడమే లక్ష్యంగా కేసీఆర్ తాజా అడుగులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు లేవనెత్తిన అంశాల్లోనే కేసీఆర్ వెనక్కి తగ్గటం ఇందుకు బలాన్నిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్, ఉద్యోగాల అంశాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు అంశాల్లో కేసీఆర్ దిగిరావడంతో.. బీజేపీకి ఇక ప్రచారం చేయడానికి వేరే అంశాలు లేకుండా పోయాయని చెబుతున్నారు. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరి దూరమవుతున్న ప్రజలను తిరిగి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కేసీఆర్ వ్యూహంలో దాగి ఉన్నాయని అంటున్నారు.
రానున్న కాలంలో కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే విద్యుత్ సంస్కరణలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు ప్రత్యేక కోటాలాంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.ఆయుష్మాన్ భారత్, వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు బీజేపీ నేతలు. కేంద్ర చట్టాలను తెలంగాణ సర్కారు అమలుచేయకపోవడంతో పేదలకు ప్రయోజనం అందడంలేదని బీజేపీ ఇంతకాలం విమర్శించింది. ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రానికే జై కొట్టారు కేసీఆర్. దీంతో రైతులలో ఇకపైన వ్యతిరేకత వస్తే దానికి కేంద్రమే జవాబుదారీ అనే అభిప్రాయం నెలకొంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ దోషిగా నిలబడుతుంది. బీజేపీని ఎక్కడా విమర్శించకుండా రైతుల ద్వారానే కాగల కార్యాన్ని ఇలా సాధించాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేసినట్లయితే దాని ద్వారా కనీసంగా రూ. 250 కోట్లు రాష్ట్రానికి అందే వీలు ఉంది.కేంద్రం దారిలో నడవడం ద్వారా రోజువారీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చన్న అంశం కూడా కేసీఆర్ వ్యూహంలో కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేయడంతో పాటు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నింటినీ ఒక్కటొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ బాస్. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉద్యోగులకు జీతాల పెంపు , సామాన్యులకు ఎల్ఆర్ఎస్ మినహాయింపు అందులో భాగమేనంటున్నారు. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికులు జరుగునున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తాజా వ్యూహాలతో బీజేపీకి రాజకీయ అంశాలు లేకుండా చేయడంతో పాటు ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే.. కేసీఆర్ తన నైజానికి భిన్నంగా యూటర్న్ లు తీసుకుంటున్నారని చెబుతున్నారు.