టీఎస్ కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్! దుబ్బాక ఫలితం తర్వాత ముహుర్తం
posted on Nov 4, 2020 9:25AM
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? కేబినెట్ నుంచి కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? అనే చర్చ అధికార టీఆర్ఎస్ లో జోరుగా జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు ఉంటాయా లేక భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న దానిపై మాత్రం గులాబీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుందంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ మంచి మెజార్టీ గెలిస్తే కేబినెట్ లో స్వల్ప మార్పులే ఉంటాయని, దుబ్బాకలో కారు ఓడిపోయినా, మార్జిన్ మెజార్టీతో గెలిచినా కేబినెట్ లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలిచినప్పటి నుంచే మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరుగుతోంది. కవితను కేబినెట్ లో తీసుకునేందుకు ఎవరో ఒక మంత్రిని తప్పిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఈ సమయంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి రాసలీలలు బయటికి రావడం పెద్ద దుమారమే రేపింది. వివాదంలో చిక్కుకున్న ఆ మంత్రిని తప్పించి కవితకు కేబినెట్ లో బెర్త్ ఇస్తారని భావించారు. అయితే కవిత ఒక్కరినే కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని భావిస్తున్న కేసీఆర్.. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థికరీంచే అవకాశాలే
ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగితే ముగ్గురు మంత్రులకు పదవి గండం ఉందనే ప్రచారం టీఆర్ఎస్ లో జరుగుతోంది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి పేరు మొదటగా వినిపిస్తోంది. వేముల జూనియర్ అయినా మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. అయితే ఆయన పనితీరు ఆశించనంతగా లేదని అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుతోనూ వేములకు మంచి సంబంధాలు లేవంటున్నారు. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చాలా సార్లు వెళ్లాయంటున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కవితపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కవిత ఎమ్మెల్సీ కాగానే ప్రశాంత్ రెడ్డి ప్లేస్ లో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇందూరు నేతలు ఇప్పటికే కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ను కూడా మంత్రివర్గం నుంచి తప్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ అనుకున్నంతగా పని చేయడం లేదని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా మారారు. బహిరంగగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలను కంట్రోల్ చేయడంలో శ్రీనివాస్ గౌడ్ పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్ తో చెప్పినట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ మంత్రి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, పార్టీ నేతలెవరని కలుపుకుని పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే శ్రీనివాస్ గౌడ్ ను తప్పించి ఆయన ప్లేస్ మరో బీసీ నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే చర్చ తెలంగాణ భవన్ లో జరుగుతోంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ పై కూడా చాలా కాలంగా కత్తి వేలాడుతుందంటున్నారు. సీనియర్ల కాదని మంత్రి పదవి ఇచ్చినా ఆయన పాత పోకడలే అవలంభించారని, తన వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి చెడ్డ పేరు తెచ్చారనే విమర్శలు గంగులపై ఉన్నాయంటున్నారు. జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ తోనూ గంగులకు సఖ్యత లేదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో పార్టీ ఓటమికి గంగుల చేసిన తప్పులే కారణమనే ఆరోపణలు కేసీఆర్ దగ్గరకు చేరాయంటున్నారు. అయితే గంగులను తొలగించాలని కేసీఆర్ భావిస్తుండగానే.. ఆయనకు ఆయనే కొత్త చిక్కులు
తెచ్చుకున్నారనే చర్చ కరీంనగర్ టీఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో గంగులను కేబినెట్ నుంచి తొలగించడం ఖాయమంటున్నారు.
ఒకరా ముగ్గురా పక్కాగా తెలియకున్నా మంత్రివర్గంలో కేసీఆర్ మార్పులు చేయడం ఖాయమంటున్నారు. అయితే ఒకరిని తొలగించాల్సి వస్తే గంగులే ఫస్ట్ ఛాయిస్ గా ఉండవచ్చుంటున్నారు. మార్పులు జరిగితే కేబినెట్ లోకి కొత్తగా ఎవరూ వస్తారన్న దానిపైనా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. గంగులను తొలగిస్తే ఆయన సామాజిక వర్గానికే చెందిన వరంగల్ జిల్లాకు చెందిన దాన్యం వినయ్ భాస్కర్ కు ఛాన్స్ ఉంటుందంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్ కు కేసీఆర్ సెకండ్ టర్మ్ కేబినెట్ లో అవకాశం వస్తుందనుకున్నారు. కాని ఆ పోస్టును ఎర్రబెల్లి ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వినయ్ భాస్కర్ అసంతృప్తిగానే ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చినా వినయ్ భాస్కర్ అంత యాక్టివ్ గా కనిపించడం లేదని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. కేబినెట్ లో ప్రస్తుతం మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గంగుల ఒక్కరే ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదని మున్నూరుకాపులు కోపంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ లో ఓటమికి ఇది ఒక కారణమని చెబుతారు. దీంతో కేబినెట్ నుంచి గంగులను తప్పిస్తే మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన వినయ్ భాస్కర్ తోనే భర్తీ చేస్తారని చెబుతున్నారు.
కవితను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డినే తొలగిస్తారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. దీనిపై నిజామాబాద్ కారు పార్టీలో ఫుల్ క్లారిటీ ఉందంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ ను మారిస్తే ఆయన ప్లేస్ లో హైదరాబాద్ లో పట్టున్న దానం నాగేందర్ లేదా మరో బీసీ నేతను కేబినెట్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందే కేబినెట్ లో మార్పులు జరిగితే మాత్రం దానంకు బంపరాఫర్ తగలవచ్చంటున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో కీలక మార్పులు జరుగుతాయని, ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు జరగడం ఖాయమని మాత్రం తెలుస్తోంది.