ఢిల్లీకి కేసీఆర్ కవితకు సీఎం కుర్చీ?
posted on Dec 16, 2022 @ 1:15PM
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడల్లో మాంచి దిట్ట. ఎన్నికల వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, కానీ, పుష్కర కాలానికి పైగా తెలంగాణ ఉద్యమాన్ని ఒడిదుడుకులు లేకుండా నడిపిన ఆయన, ఇప్పడు కుటుంబ రాజకీయాలను చక్క దిద్దడంలో తడబడుతున్నారు. తప్పులు చేస్తున్నారు. చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఇది ఎవరో రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న రాజకీయ విమర్శ కాదు, సొంత పార్టీ నాయకులు చేస్తున్న సద్విమర్శ. నిజానికి, తెరాస పేరు మారినా తీరు మారక పోవడానికి, పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు అన్నిటికీ, కుటుంబ కలహాలే కారణమని పార్టీ నేతలు పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళిన నేతలు ఎవరిని కదిల్చినా ఇదే మాట వినిపిస్తోంది.
జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీలో జెండా ఎగరేసేందుకు రాష్ట్రం నుంచి నాయకులు, కార్యకర్తలను తోలుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ తో ఫోటో కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ రావడం చిత్రంగా ఉందని, ఈ అన్నిటికీ కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. సొంత పార్టీ నాయకులు ఢిల్లీ గోడలకు చెవులుండవనే భరోసాతోనే కావచ్చును కానీ, మాట్లాడుకుంటున్న మాటలు, పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయని, ఢిల్లీ వాలాలు, అంటున్నారు.
అదలా ఉంటే రాష్ట్రంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకుకులు మంత్రి కేటీఆర్, భారత రాష్ట్ర సమితి (భారాస) ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అలిగారా? ముఖ్యంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కంటే కుమార్తె కవితకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అందుకే ఆ అక్కసుతో కేటీఆర్ తండ్రి మీద అలిగి ఢిల్లీ వెళ్ళలేదా? అందుకే ఆయన భారాస వేడుకకు దూరంగా ఉన్నారా ? డుమ్మా కొట్టారా? అని ఉహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే కేటీఆర్ అదేమే లేదని, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్లనే ఢిల్లీ వెళ్ళ లేక పోయానని వివరణ ఇచ్చారు.
అదలా ఉంటే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోతున్న నేపధ్యంలో రాష్ట్రంలో భారాస పార్టీ పగ్గాలు కవితకు ఇవ్వాలని, అదే విధంగా ముఖ్యమత్రి పదివిని కూడా కూతురు కవితకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా .. అనే అనుమానాలు కలుగుతున్నాయని కొండ సురేఖ బాంబు పేల్చారు.
కొండ సురేఖ ఏ ఆధారాలతో ఈ అనుమానాలు వ్యక్త పరిచారో ఏమో కానీ, అన్నా- చెల్లీ మధ్య రాజకీయ చిచ్చు రగులుతోందనేది మాత్రం తిరుగులేని నిజం. గతంలోనూ కవిత పండగలు పబ్బాలకు కూడా పుట్టిల్లు ( ప్రగతి భవన్) గడప తొక్కడం లేదని, వార్తలొచ్చాయి. చివరకు రాఖీ, బతుకమ్మ పండగ వేడుకలలో కూడా ఆమె ప్రగతి భవన్ లో కనిపించేలేదు. ఈ నేపధ్యంలోనే కావచ్చును ఇప్పడు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాయలం ప్రారంభోత్సవానికి వెళ్లకపోవడం వెనుక ఇంకేదో కారణం ఉందనే అనుమానాలు, కొండ సురేఖ వంటి వారు వ్యక్తపరుస్తున్నారు.
అయితే, అవ్వన్నీ ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక చాలు దొర అని ప్రజలు సాగనంపే వరకు ముఖ్యమంత్రి పదవిని వదులు కోరని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య సాగుతున్న తెరచాటు యుద్ధమే, తెరాస/ భారాస సమస్యలకు మూల కారణం అంటున్నారు. అవును కుటుంబ పార్టీలలో కుటుంబ కలహాలే ఉంటాయి .. అంటున్నారు.నిజమేనేమో ..