కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు!?
posted on Dec 19, 2023 @ 12:24PM
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మేడిగడ్డ ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే. అసలు మొదటి నుంచీ మేడి గడ్డ పనున నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మేడిగడ్డ డిజైన్ తనదేననీ మొదటి నుంచీ కేసీఆర్ చెప్పుకుంటుండటం, ఇప్పుడు ఆ మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్లు కుంగిపోవడంతో అందరి చూపూ కేసీఆర్ వైపే మళ్లింది. సరే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, వ్యయం, నాణ్యతపై తొలి నుంచి విమర్శలు, ఆరోపణలూ చేస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డపై రివ్యూ చేసింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియెట్ లో జరిపిన రివ్యూ మీటింగ్ లో మేడిగడ్డ డిజైన్ తాము రూపొందించలేదని అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. మేడిగడ్డ నిర్మణ పనులు, డిజైన్ తదితర అంశాలతో తమకెవరికీ సంబంధం లేదనీ, మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ కనుసన్నలలోనే జరిగిందని అధికారులు చెప్పారని ఆ సమావేశంలో పాల్గొన్న వారే బయటకు వెల్లడించారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వ్యక్తి ఇంకా అధికారులను ఉటంకిస్తూ.. అప్పట్లో కేసీఆర్ మాటకు తాము ఎదురు చెప్పే పరిస్థితి లేదనీ, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే బ్యారేజీ నిర్మాణం జరిగిందని విస్పష్టంగా చెప్పేశారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ, నిపుణుల సూచలను, సలహాలూ తీసుకోకుండా బ్యారేజీ డిజైన్ ఎలా జరిగిందని నిలదీశారు. అంతే కాకుండా మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ బాధ్యత ఎవరిదంటూ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ప్రతినిథులను మంత్రి గట్టిగా ప్రశ్నించారు. ఇంత భారీ వ్యయంతో కట్టిన బ్యారేజీ నాలుగేళ్లకే ఇలా కుంగిపోయిందంటూ నిర్మాణ సంస్థకు బాధ్యత లేదా అని నిలదీశారు.
ఇలా ఉండగా మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటుపై విచరణకు ప్రభుత్వం నిర్ణయించింది. సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ప్రాజెక్టును డిజైన్ చేసిన కేసీఆర్, పర్యవేక్షించిన ఇంజినీర్లు, కట్టిన కాంట్రాక్టర్లు ఇలా అందరూ విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కేసీఆర్, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉన్న హరీశ్‌రావులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో మేడిగడ్డ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.