ఈ మరాఠా యోధుడిని శ్లాఘించిన కెసీఆర్
posted on Aug 1, 2023 @ 5:46PM
ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అన్నాభావ్ సాథే పేరు కొత్తగా పరిచయమైంది. ఎందుకంటే తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటనలో ఆయనను కీర్తిస్తూ మాట్లాడారు. భారత రత్న అవార్డు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అన్నాభావ్ సాథే మరాఠా ప్రజలకు సుపరిచితుడు. సామాజిక కార్యకర్త. జానపద కళాకారుడు, కవి, రచయిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలకు సేవ చేసిన యోధుడు. పైగా దళితుడు. పీడిత, తాడిత ప్రజానీకం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. మరాఠాలకు ఒక రకంగా దేవుడు లాంటి మనిషి. అంటరాని కులంలో పుట్టినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.
సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారు.
మహరాష్ట్ర సాంగ్లీ జిల్లా వతేగావ్ లో పుట్టిన అన్నాభావ్ సాథే ఎస్ సిలోని మాతంగ్ తెగకు చెందిన వ్యక్తి.
అన్నాబావ్ సాథే పెద్దగా చదువుకోలేదు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్థి పలికారు కానీ సమాజాన్ని బాగా చదివారు.
సాథే ఇప్పటి వరకు 35 నవలలు రచించారు. ఇందులో ఫకీరా(1959) చాలా ప్రాచుర్యం పొందింది. ఈ నవలకు మహ ప్రభుత్వం అవార్డును కూడా ప్రకటించింది. నవలలతో బాటు షార్ట్ స్టోరీలు రాశారు. రష్యాలో కూడా ఆయన అనేక నాటక ప్రదర్శనలు చేశారు. అన్నా భావ్ సాథే కమ్యూనిస్ట్ సిద్దాంతాలకు ప్రభావితులయ్యారు. భారత రాజ్యాంగనిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో సాథే దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాథే బుద్దిజం కు కూడా ప్రభావితం చెందారు. ఆయన పేరు మీద 2002లో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది.